పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

జేయును. అట్టిపరీక్షలు చూచి కుచుమారుఁ డటఁగదలి దక్షిణాభిముఖుండై యరుగుచుండెను.

అని యెఱింగించి వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలి కథ పై మజిలీయందుఁ జెప్ప మొదలుపెట్టెను.

155 వ మజిలీ.

−♦ సరస్వతికథ. ♦−

కుచుమారుం డొకనాఁ డొకయగ్రహారమున నొకబ్రాహ్మణుని యింటి కతిథిగాఁ బోయెను. ఆగృహస్థు భుజించునప్పుడు కుచుమారునితో అయ్యా ! మీరూపము దర్శనీయము. మీతేజము విద్యాధిక్యము సూచించుచున్నది. ఎందుఁబోవుచున్నారు ? ఈజన్మభూమి యేది ? అని ప్రస్తావోచితముగా నడిగిన నతండు తనకాఁపురము కాశీపురమనియు మిత్రులతోఁ దాను సమస్తవిద్యలం జదివితిననియుఁ బండితకల్పభూజుండగు భోజభూభుజుని యాస్థానవిద్వాంసుల జయింప ధారానగరంబున కరుగుచున్నామనియుఁ దనయుదంత మాద్యంత మెఱిఁగించెను.

అప్పు డాబ్రాహ్మణుఁడు వెఱఁగుపాటుతో అయ్యా ! మీరంతవారైనచో నంతశ్రమపడి ధారానగరమున కరుగ నేల ? అరిగి యందలి పండితులఁ బరాజితులఁ గావించితిరేని యాఱేఁడు వేలిచ్చును లక్ష లిచ్చునుగాని తనరాజ్య మీయఁడుగదా ? మీకంతవిద్యలలో గట్టితనము గలిగియున్నచో సులభముగా రాజ్యలక్ష్మిం జేపట్టుతెఱఁ గెఱింగించెద నాకేమి పారితోషికమిత్తురు? అనుటయుఁ గుచుమారుండు నవ్వుచు నార్యా ! మీ యుపదేశంబున నాకు రాజ్యమే వచ్చినచో మీరును గొంత ఫలభాక్కులు కాకపోరు. వాక్కులతో నేమిప్రయోజనము ? అని యుత్తరమిచ్చెను.

అప్పు డాగేస్తు వినుండు. హిరణ్యగర్భుండను నృపాలుండు పురందరపురమును రాజధానిగాఁ జేసికొని యీదేశమును బాలించుచున్నాడు. ఆనగర మిక్కడ కిరువదియామడ దూరములో నున్నది. ఆరాజు