పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిద్ధునిస్వీయచరిత్ర కథ.

177

యభిలాషయున్నదా? అట్లైనఁ జెప్పెదనాలింపుము. అణిమ = పరమాణు ప్రమాణుఁడై వసించుట, మహిమ = బ్రహ్మవిష్ణ్వాదులకంటెఁ బెద్దవాఁడై యొప్పుట, గరిమ = బ్రహ్మాండమువలె భారముగానుండుట, లఘిమ = మేరువంతయుండియు దూదివలెఁ దేలికగానుండుట, ప్రాప్తి = తలఁచినంత నే వలసినపదార్థములు తనయొద్దకు వచ్చునట్లు చేయుట, ప్రాకామ్యము = ఎక్కడికిఁబోవలెనన్న నక్కడికిఁబోవుట, ఈశత్వము = దేవతలకు సైత మధిపతిగానుండుట, వశిత్వము = దేవతలు మనుష్యలేకాక పశుపక్షి మృగాదులు తనకువశమై పరిజనులవలె నుపచారములు సేయుట.

అష్టసిద్ధులనఁగా నివియని యర్థము సెప్పినవిని మహీధరభట్టు స్వామీ ! యీసిద్ధు లెట్లు సాధ్యమగునని యడిగిన నతండు,

శ్లో॥ యద్దుష్కరం యద్దురాపం యద్దుర్లభ్యంచ దుస్తరం।
     తత్సర్వం తపసాప్రాప్యం తపోహి దురతిక్రమం॥

చేయుటకుఁ బొందుటకు దాటుటకు నేదిశక్యముకాదో అది తపంబున శక్యమగును. తపముచేయుట మాత్రము కడుకష్టము. అనియెఱింగించి తపంబుసేసి వీనిం బడయుమని పరిహాసముగాఁ బలికెను. వాని కాసాధనముల సాధింపవలయునని సంకల్పము జనించినది.

అతం డదేపయనముగా నుత్తరదేశారణ్యములు కొండలు గుహలు లోనగు దర్గమప్రదేశంబులు దిరుగుఁ గనంబడినబైరాగికెల్లఁ దనసంకల్ప మెఱిఁగించుచు నీవా? తపంబుగావించువాఁడవని పరిహసింపఁబడుచుఁ దిరిగితిరిగి యొకనాఁ డొకకొండగుహలోఁ దపంబుచేసికొనుచున్న యవధూతంజూచి యాయనతోఁ దనసంకల్పము సెప్పక యూరక శుశ్రూష గావింపుచుండెను.

ఉపచారపరిగ్రహ మూరకపోవదు. ఒకనాఁ డాయవధూత మహీధరభట్టుంజూచి యోరీ ! నీ వెవ్వఁడ వేమిటికి నన్నిట్లాశ్రయించు చుంటివి ? నీయభీష్ట మేమని యడిగిన నతండు సంతసించుచు నమస్కార