పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుచుకుమారునికథ.

175

చూచుచు దానువినిన యానవాళ్ళ ననుసరించి పోయి పోయి యొక తటాకముచెంత కరిగెను.

ఆజలాకరము మనోహరములగు సోపానములచే వెలసియున్నది. జలము పసరెక్కి నాచుగట్టినది. మెట్లన్నియుఁ బాడుపడినవి. జలకుసుమము లేమియును లేవు. సారవిహీనమగు నక్కాసారంబు శోభ విమర్శించి కుచుమారుం డీయరణ్యమంతయుఁ దేజశ్శూన్యమై యున్నది. కోయవాఁడెఱింగించిన సరస్సిదియే కావచ్చును. అదిగో తూరుపుగాఁ గనంబడుచున్న మఱ్ఱిచెట్టు సిద్ధుని యునికిపట్టుకావచ్చును. అందెవ్వరును లేనట్లు తోఁచుచున్నది ఇది తప్పక సిద్ధుని వనమే. అందుపోయి చూచెదంగాక యని తలంచుచు నావటవిటపినికటమునకుఁ బోయెను.

దానిక్రింద నొక పర్ణశాల పాడువడి యున్నది. కృష్ణాజిన కమండలువులశకలము లక్కడక్కడ పడియున్నవి. సిద్ధుండు పరమపదించె ననియు దానంజేసి శోభాశూన్యంబైయున్నదనియు నిశ్చయించి యతండాప్రాంత భాగములు సంచరించుచు నేవిశేషమును గానక కొంతసేపా చెట్టుక్రిందఁ గూర్చుండి ధ్యానించుచు మోమెత్తి యత్తరూచ్ఛాయంబుఁ బరికించెను.

ఆవృక్షాగ్రమునుండి యవ్వనప్రమాణంబు చూడ సంకల్పము పుట్టినంత నతం డట్టెలేచి యతికష్టమున నా చెట్టెక్కి మధ్యశాఖావసానమున నిలువంబడి నలుమూలలు పరికించిచూచెను. ఆ వనమంతయు నతనికిఁ గనంబడినది. శోభావిహీనమైయున్నది. సిద్ధుని మరణమునకు వగచుచు నతండు క్రమ్మఱ వృక్షావరోహణము గావింపుచు గోటకముల శాఖాంతరములఁబరిశీలించుచుండెను. స్కంధోపరిభాగంబున నొక కోటరమునకు బిరడాయున్నట్లు తోచుటయు నతం డాబిరడా పట్టుకొని లాగెను సులభముగా నూడివచ్చినది. లోపల మందసమువలె నున్నందునఁ జేయిపెట్టి తడవిచూచెను. ఒక తాటియాకుల పుస్తక మతని