పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుచుకుమారునికథ.

173

నాభుండు నవ్వుచు నిట్లనియె.

మిత్రమా ! నిన్ను రావలదని మొదటనే చెప్పితిని. నే నీయరణ్యాంతము చూడక మఱలువాఁడనుకాను. ఈయరణ్యము నాయంతమే చూచెనేని చింతయేలేదు. ఇంక వ్యవధి చాల యున్నది. బ్రతికియుండిన నియమితకాలమునకు నేను ధారానగరమునకు వచ్చువాఁడ. నీవిందుండి క్రమ్మఱ దేశములమీఁదుగాఁ బొమ్మని చెప్పినవిని కుచుమారుం డనేకవిధముల నతని వెనుకకు రమ్మని బ్రతిమాలికొనియెను కాని యతండంగీకరింపలేదు. సౌహార్ద్రవిశేషంబున సువర్ణనాభుని బలుమా రాలింగనములు చేసికొని విడువలేక విడువలేక విడిచి దక్షిణాభిముఖుండై యరుగుచు నొకనాఁడొక కోయపల్లె సేరి యందున్నవారిలోఁ బెద్దవానింజీరి యోరీ ! ఇక్కడికిఁ గాశీపురం బేదెసగానున్నదియో చెప్పఁగలవా ? ధారానగరమునకు మాగన్‌ము దెలియునా ? పాటలీపుత్రనగరముపేరు వింటివా ? అని యడిగినవాఁడు స్వామీ! ఆపేరులేవియు నేనెఱుఁగను. కాశీయని మాపెద్దలు సెప్పుచుందురు. చచ్చినతరువాతఁ బుణ్యము సేసినవా రందువోవుదురని చెప్పికొనియెదరు. ఆదారులేమియు నాకుఁ దెలియవని చెప్పెను.

మా కాపురము కాశీపురమే. అది యీభూమిమీఁదనే యున్నది. చచ్చినతరువాతఁ బోవునది స్వగన్‌ము. అది మీఁదుగానున్నదని వానితో ముచ్చటించుచు నోరీ ! మీయడవిలో నాశ్చర్యకరములైన విశేషము లేమైనంగలవా? మహర్షులుగాని యోగులుగాని సిద్ధులుగాని యెందైనఁ దపముచేసికొనుచున్న వారింజూచితివా ? జ్ఞాపకముచేసికొని చెప్పుమని యడిగిన వాఁడు బాబూ ! లేకేమి ? ఇక్కడికిఁ బదిదినముల పయనములోఁ బడమరగా నొకరుసి గలఁడు. ఆయన కెన్నియేండ్లున్నవియో యెఱిఁగినవారులేరు. పెద్దపులులు సింగములు మొదలగు మెకము లాయనచెప్పిన పనులు చేయుచుండును. ఆయనయున్న యడవి