పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణపది కథ.

169

బ్రాలుగా విరజిమ్ముకొంటిమి. ఇరువురము గలిసికొని మన్మథకళాకౌశలంబుమీఱఁ గ్రీడాపరవశులమై నూఱహోరాత్రంబులు గడియవలె వెళ్ళించితిమి. ఆప్రమదారత్వమువలనఁ గొన్నిసాంప్రదాయములు దెలిసికొని సాంప్రయోగికప్రకరణము వ్రాసితిని.

అ ట్లాసుందరీరత్నముతో నాలుగునెల లందువసియించి యడవిఁగాసిన వెన్నెలవలె నాదివ్యస్త్రీభోగ భాగ్యంబులు జూచి యానందించు మిత్రులు దూరమందుండుట తలంచి యమ్మించుఁబోఁడిం బ్రార్థించి భూలోకసంచారమున కనుజ్ఞ వడసితిని. ఆచిన్నది యక్షకాంతయైనను గుబేరశాపంబునంజేసి దేవతాశక్తి వెలితిపడియున్నది. భూమియం దెక్కడనో తనయక్క యున్నదికావున నామెం జూచువేడుక దీపింప నాతో దేశసంచారముచేయుట కంగీకరించినది. మేమిరువుర మాగిరిశిఖర మతికష్టమున దిగి కొండలోయల దాటి యరణ్యంబు లతిక్రమించి మెట్టల మీఱి క్రమంబున నాఱుమాసములకు జనపదంబులు సేరితిమి.

ఆయరణ్యములు దాటునప్పు డాకోమలిపడినవెత లేతాదృశములని చెప్పఁజాలను. ఎట్లో సహించి నాతో వచ్చినది. నడుమనడుమఁ బట్టణంబుల సభలఁగావించుచు ద్రవ్యముపార్జించితిమి. మన మనుకొనినకాలము దాటినది మీరీయూర నుందురో లేదో యని సందియముతోనే వచ్చి పాండిత్యవేషము విడిచి సంగీతప్రసంగంబున విత్తము సంపాదించు చుంటిమి. ఇదియే మావృత్తాంతము. నిన్న నే యీసత్రంబున గోడపై మీవ్రాఁతఁ జూచితిని. నిన్న పాడినది నీమిత్రునిభార్య సువర్ణ పదిక. నిన్నుఁ బొడగంటి కృతకృత్యుండనైతిని. తక్కిన మనమిత్రులు గనం బడిరా? విశేషము లేమియని యడిగిన నతండు నివ్వెఱఁపడి భళిరా దైవనియోగము. ఎంతసంతోషవార్తవింటిని. నేఁ డెంతసుదినము. ఆహా నీయదృష్టము. అని కొనియాడుచుఁ దనవృత్తాంతము కొంతకొంత చెప్పి యతనికి సంతోషము గలుగఁజేసెను.