పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పర్వముగావించినది.

ఆసరోవరము చుట్టును మలచిన శిలలచే సోపానములు, గట్టఁబడియున్నవి. ఫలకుసుమధళ ప్రధానములగు తరులతాగుల్మాదులు శ్రేణులుగాఁ జుట్టును వెలయుచున్నవి. జలఖగముల నాదములు శ్రోత్రపర్వము సేయ కైరవకల్హారపరిమళ చోరకములగు మందవాయువులు మార్గశ్రమంబు బోకార్ప భృంగనాదంబు లాలించుచుఁ దత్తీరవిశేషంబులు సూచుచుఁ దటాకంబునకుఁ బ్రదక్షిణము గావించితిని.

ఒకదెస నాజలాకరంబున కల్లంతదవ్వులో నొక సిద్ధాయతనంబు ముఖమంటపమున నొకచిన్నది వీణపాడుకొనుచున్నది. చూచి విస్మయపడి మెల్లన దాపునకుఁబోయి యోరగా నిలువంబడితిని. ఆమె సంగీతము తొందరలో నన్ను విమర్శించలేదు. కొంతసేపటికి - వినమ్రుఁడనైయున్న నన్నుఁజూచి యదరిపడి యట్టెలేచి, దేవభాషతో—

చిన్నది — క స్త్వం - నీ వెవ్వఁడవు?

నేను - మహీసురేంద్ర నందనొహం. సువర్ణనాభ - ఇతి మాం జల్పతి "నేనొక - బ్రాహ్మణపుత్రుండ, సువర్ణనాభుఁడని నన్నుఁ బిలుతురు.″

చిన్నది — కిమర్థమాగతోసి. "ఎందులకై యిక్కడికి వచ్చితివి?"

నేను - భవాదృశ సుదృగ్దర్శనార్ధం దేశాన్ పర్యటామి. మీవంటి విద్వాంసులఁ జూచుటకై దేశములు దిరుగుచుంటిని.

చిన్నది - ఇహతవకిమస్తి - ఇక్కడ నీ కేమియున్నది ?

నేను - త్రిలోకదుర్లభవస్తుదర్శనమేవా గమనఫలం మమ.

చిన్నది - అహో! వాచాలతాతవ. ఏకాంతవనాంతరనివాసినాం కాంతానామంతిక మాగంతన్యంవా ? యింత రహస్యస్థలమందుండు స్త్రీలకడకు రావచ్చునా?

నేను - విధిరేవాత్రకారణం నోచెన్మానుషాణాం ద్రష్టుం శక్యం.