పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణనాభునికథ.

165

రముమీఁద నిలువఁబడి దారికై నలుమూలలు సూచుచుండ నా ప్రాంతమందెవ్వరో సంగీతము పాడుచున్నట్లు మనోహరనినాదము వినంబడినది. ఆపాటవీతెంచినదెసకుఁ జెవియొగ్గి విని యాగానస్వాన మమృతకల్పమై సంతసముగలిగింప నానందపరవశుఁడనై యాగాంధర్వ మమానుషమని నిశ్చయించి యందుఁబోవసమకట్టి యాశృంగముచుట్టును దిరిగితిని. ఎక్కుట కెందును మార్గ మగపడినదికాదు. బొంగరమువలె వట్రువైయున్నది. దూరదూరముగాఁ జిన్నచిన్నరుప్పలుమాత్రమున్నవి.

దర్గమంబగు నాగిరికూట మెక్కుటకుఁ బదిదినములలోచించితిని. ఏయుపాయము దోచినదికాదు. అందువసింప ననవరత మాగానస్వానము వినంబడుచునేయున్నది. భగవంతునిధ్యానించుచుండ నొక యుపాయము దోచినది. అందలిమ్రానులవలనఁ గొంతనారఁదీసి యది త్రాడుగాఁజేసి యుచ్చుగట్టి యెగరవైచి దూరముగానున్న మొక్కల మొదళ్ళకుఁదగిలించుచు దానింబట్టికొని యెగఁబ్రాకుచు నీరీతి మూఁడు దినముల కాకొండశిఖర మెక్కఁగలిగితిని.

దత్తకా! ఆమూఁడుదినములు నేనుపడినకస్తికి మేరలేదు. రాత్రిపడినతోడనే కదలకనిలువంబడియున్న రుప్పనంటి కూర్చుండి తెల్లవారువఱకు జాగరముజేసితిని. కన్నుమూతపడినఁ జేయిపట్టువదలి క్రిందికిజారిపడుదును. ఒకసారి త్రాడుపట్టుకొని యెగఁబ్రాకుచుండఁ జెట్టునకుఁదగిలించిన యుచ్చుముడి వదలినది. జారి క్రిందకుదొర్లితిని. దైవవశమున నొకరుప్పకొమ్మ చేతికిఁదొరకుటచే నాగితినికాని లేనిచో గ్రిందఁబడినం దల వేయిముక్కలైపోవును. చచ్చినఁజత్తుఁగాక, గిరిశిఖర మెక్కి యాపఆటఁబాడినవారలం జూడకమాననని నిశ్చయించి క్రమ్మఱ వెనుకటిరీతినే యుచ్చువైచుచు మూడుదినముల కెక్కఁగలిగితిని.

ఆహా ! విశాలసమతలంబైన యాశృగంబున శృంగాటకంబునంబోలె మనోహరతరులతావితాన వేష్టితమైన పద్మాకరమొండు నేత్ర