పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నది. అమృతపానంబుచేసిన ట్లాకలియే కలుగునదికాదు. తృప్తిగా భుజించినట్లె యుండునది. రోగవికారము లేమియును లేవు. దేహమున వింతకాంతి మెఱయఁజొచ్చినది. అప్పుడు నే నెద్దియో యమృతతుల్యమైన యోషధిని దింటినని నిశ్చయించి మిగుల ధైర్యముతో నదులదాటి యేరులతిక్రమించి పర్వతములెక్కి యొక్కఁడనే పెక్కుదూరమరిగితిని.

వయస్యా ! జనసంచారశూన్యములగు నమ్మహాకాంతారాంతరముల సంచరించుచున్న నా కొక సిద్ధుండుగాని యొక యతీశ్వరుండు గాని, యొక తపస్విగాని గనంబడలేదు. దేవతామహిమయేమియుఁ గానుపింపదు. కొండలు నేఱులు తరులతాగుల్మాదులుగాక మఱేమివిశేషము గోచరము గాలేదు. తత్ప్రదేశమంతయు మంచుగడ్డలచే నావృతమై యున్నది. మట్టమధ్యాహ్నమునఁగాని సూర్యప్రకాశమే యగపడదు. మఱియును-

సీ. ఘనశైలతుంగశృంగము లెక్కినప్పు డా
                 కసముజేరినయట్లు . కానుపించుఁ
    బాతాళమునఁ ద్రొక్కఁబడినట్లు దోచుబల్
                తెగువ లోయలలోన దిగినయపుడు
    పెనుసముద్రమున మున్గినయట్లు భ్రమదోచు
                మంచువర్ష ము గ్రుమ్మరించునపుడు
    కాంతారమే భూమియంతయు ననఁగఁ దో
                పించుఁ గానలసంచరించు నపుడు

గీ. అంధకారమయంబులై యఖిలదిశలు
    కాటుకలుబూసినట్లు భీకరములగుచు
    బేఱుకొనియుండ నిఁకఁ దెల్లవారదనుచు
    వెఱపుజనియించు నొక్కొకవేళలందు.

అట్టికష్టంబులఁబడుచుఁ దిరుగుచుండ నొకనాఁడొక కొండశిఖ .