పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సువర్ణనాభునికథ.

163

తారువ్రాసిన వ్రాఁతక్రిందనే సువర్ణనాభుడు తానా నగరమునకు వచ్చినట్లుగా వ్రాసి మఱల నాదివసమునందువచ్చి చూచెదనని కూడ తెలియపఱచెను. ఆసమయము దత్తుఁడువచ్చు సమయము నొక్కటియే యైనది. దత్తుఁడక్కడ నుండగనే సువర్ణనాభుఁడు వచ్చెను. దత్తుఁడతని గురుతుపట్టలేకపోయెను. అతనిది వెనుకటివేషముగాదు. దివ్యరత్నభూషాంబరములు దాల్చియున్నాఁడు. వెనుక శుద్ధశ్రోత్రియ వేషముతో నుండువాఁడు: దత్తుఁడెప్పుడు విలాసపురుషుఁడే. దత్తుని గుఱుతుపట్టి సువర్ణనాభుఁడు మిత్రమా! వచ్చితివా ! అని కౌఁగలించుకొనియెను. అతఁడే సువర్ణనాభుఁడని గ్రహించి దత్తుఁడును బ్రత్యాశ్లేషము గావించుచు వయస్యా ! నీ నిమిత్తమే వచ్చుచ్చుంటి: నీ వ్రాత యిప్పుడే చూచితిని. నిన్న నాటకశాలలో జరిగిన సంగీతసభకు వచ్చి నీపేరు వింటిమి. ఆగాయనీరత్నము నీకళత్రమైనట్లు స్తుతిగీతమునుబట్టి గ్రహించితిమి. అట్టికలకంఠి నెట్లుపరిణయంబైతివి ? నీవు వారణాశీపురంబు విడిచినది మొద లెందెందు సంచరించితివో నీ యుదంత మెఱింగింపుమని యడిగిన నతఁడొక రమ్యప్రదేశమునఁ గూర్చుండి యిట్లు చెప్పఁదొడంగెను.

−♦ సువర్ణ నాభునికథ. ♦−

మిత్రమా! నాఁడు " మిమ్మందఱ విడచి యుత్తరభూములఁ జూడవలయునని యభిలాషజనింపఁ దెంపునఁ జలికివెఱవక కష్టముల సహించుచు నేనును గుచుమారుండును గొన్నిపయనంబులు సేసితిమి. కుచుమారుండు సుకుమారుండగుట కష్టములకోర్వఁజాలక వెనుకకు మఱలిపోయెను. నేనుత్తరాభిముఖండనై పోయిపోయి మహారణ్య దుర్గమములగు పర్వతమథ్యముల సంచరించుచుఁ దీసికొనిపోయిన యాహారపదార్థములు సరిబోయినవెనుక ఫలములచే నాకలి నడచికొనుచు మఱికొన్నిదినంబులకు నాకులుదిని యాకలి దీర్చుకొనునలవాటు జేసికొంటిని. పర్ణములు జీర్ణములైన కొలది నా మేనికి మంచిబలము గలిగి