పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    భజేహ మాదౌ జితపాపలోభం
    సువర్ణ నాభం మమజీవనాథం.

అని ప్రార్థించి యద్భుతగాంధర్వమున సభాసదుల హృదయంబులు నీరుగావించినది. పాడినరీతిపాడకుండ రెండుయామములుదనుక సంగీతవిద్యాపాటవము చూపి శ్రోతల గానామృతహ్రదంబున ముంచి వేసినది. మంగళగీతములు పాడినంత తెర వేయఁబడినది సభ్యులకరతాళధ్వనులు స్తుతివాక్యనినదములతోఁ గలిసికొని నింగిముట్టిసవి.

రాజపుత్రుఁడు మిత్రులతో నింటికిఁబోయి నిద్రబోక యాసంగీత ప్రశంసయే గావింపుచు దత్తునితో మిత్రమా! అది చారుమతి యను నాసతోఁ బోయితిని. సువర్ణనాభుఁడను బ్రాహ్మణుని భార్యయైనట్లు తెల్లమైనది. చారుమతిగూడ నిట్లు బాడఁగలదుసుమీ ! యనిపలికిన నవ్వుచు దత్తుం డిట్లనియె.

రాజపుత్రా ! నీ వది చారుమతిగాదని యప్పుడే నిశ్చయింపవలదు. వేశ్యకువిటుఁడే ప్రాణనాథుఁడగును. సువర్ణ నాభుఁ డట్టివాఁ డగునేమో. రేపు వారినాటకశాలకుంబోయి పూర్వోత్తరమంతయుఁ దెలిసి కొనివచ్చెద ననుజ్ఞయిమ్ము. అనుడు నతండు: నీవు వెళ్లిన మఱలరావు. నిన్నువిడువను. అది చారుమతిగాదు. అని పలికినవిని దత్తకుండు మీకడ శపథముజేసినతరువాత రాకపోవుదునా?' నాఁడు నా కావిధము దెలియక యూరికిఁబోతిని. రేపు తప్పక వారితెరగరసి వెంటనే మీ కడకు వత్తునని నచ్చఁబలికి తదానతి నింటికిఁ బోయెను.

సువర్ణనాభునిపేరువినినది మొదలాపండితుల కతండు తదుమిత్రుఁడేమోయని, భ్రాంతిగలిగినది. మఱునాఁడుదయంబున దత్తుఁడు గోణికాపుత్రు రాజపుత్రునొద్దకుఁ బంపి తాను సువర్ణనాభునివార్త నారయుటకై నాటకశాలకుం బోవుచు దారిలోఁగనంబడిన సత్రములోపలికిఁ బోయి తత్కుడ్యభాగములన్నియుఁ జూచుచుండెను.