పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యక్షిణీగానము కథ.

161

నని గట్టిగా నిర్బంధించెను. అతం డేమాటయుఁ జెప్పుటకు శక్యమైనది కాదు. భోజన సమయములఁదప్ప సంతతము దత్తుఁ డా రాజపుత్రునొద్దనే వసియించి యిష్టాలాపములచేఁ గాలక్షేపము జేయుచుండెను.

ఒకనాఁడు రాజపుత్రుఁడు దన యిరువురుమిత్రులతోఁగూడుకొని వేడుకలు ముచ్చటింపుచున్న సమయంబున నమాత్యుం డరుదెంచి వినయ వినమితోత్తమాంగుండై భర్తృదారకా! తండ్రిగారు కాళిదాసమహాకవిం దీసికొనిరా దేశాంతరమరిగినదిమొదలు మీ రస్వస్థులైయున్నారు. మీవ్యాధి దినదినాభివృద్ధి వహింపుచున్నదిగాని తఱుగుట లేదు. ఇది పితృవియోగజన్యదుఃఖంబు గావచ్చును. రాజుగారు కొలఁదిదినములలో వత్తురనువార్తలు వచ్చుచున్నవి. మీరు విచారింప నవసరములేదు. మఱియు మనస్సంతోషప్రదాయకములగు వినోదములఁ జూచుచుండినచో మీవంత శాంతించును. ఉత్తరదేశమునుండి వచ్చిన యొకవాల్గంటి మనవీఁటినాటకశాలలో మొన్న సంగీతము పాడినది. వేనవేలుజనులు పోయిచూచిరి. దానిగానము దేవగానమని స్తోత్రములు చేయుచున్నారు. అత్తరుణి నేఁటిరాత్రి మరల సంగీతము బాడునఁట. చాటింపుచున్నారు. మీ రాప్తులతో వచ్చి తద్గానసారస్యము గ్రహించి యానందింపఁ గోరుచున్నాము. అని యెఱింగించిన నారాజనందనుం డనుమోదించి నాఁటిరాత్రి నియమితకాలంబునకు మిత్రులతోఁ గూడుకొని నాటక శాలకుం బోయి నిర్దిష్టవిష్టరంబున నుపవిష్టుండై యావిద్రుమోష్టిరాక కెదురుజూచుచుండెను.

యథాకాలమునకే గంట మ్రోగినది. తెర లాగఁబడినది. దివ్యమణిభూషాంబరముల ధరించి యొకమించుఁబోడి రంగాంగణ మలంకరించుచు సభ్యులకు మ్రొక్కి సమంచితవిపంచికాతంతువుల మ్రోగించుచు,

శ్లో. అనంత విద్యాకలిత ప్రభావం
    భావే ధరాదేవ కులప్రదీపం