పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యక్షిణీగానము కథ.

159

గానున్నది. చారుమతి ధీరమతి. ఔపనిషత్క్రియలకు వశపడునది కాదు. తత్వమెఱుఁగక దత్తుఁడాడినమాటల కాసపడి యూరకయుఱ్ఱూట లూగుచున్నాఁడు. దత్తుఁడుమాత్రమువచ్చి యేమిచేయఁగలడు ? అతఁడు వారస్త్రీల పటుఁడు. ఏ వేశ్యయింటికిఁ బోయెనో తెలియదు. ఎట్లో వానివెదకి తీసికొని పోవలయునని యాపట్టణమంతయు వెదకెను కాని యతండు గనంబడలేదు.

మఱికొన్ని దినంబులు గడచినంత నొకనాఁడుదయంబున దత్తకుఁడా నెలవునకువచ్చెను. అతనింజూచి గోణికాపుత్రుఁడు నిక్షేపము దొరకినట్లు సంతోషించుచు మిత్రమా ! ఇదియేమికర్మము. మాతోఁ జెప్పక యెక్కడికిఁ బోయితివి? రుక్మిణి యంతఃపురమునకుఁ జారుమతి మఱల వచ్చినదఁట. రాజపుత్రుండు నీకొఱకు వర్తమానముపై వర్తమానము పంపుచున్నాఁడు. నీవులేక నే నక్కడికిఁ బోయిన మండిపడుచున్నాఁడు. నీ నిమిత్తమై పట్టణమంతయు గాలించితిని. ఎందువోయితివి? పద పద, రాజకుమారుని కన్నులంబడినఁ గొంతపరితాప మడఁగగలదని పలుకుచు నతని వెంటఁబెట్టికొని యప్పుడే రాజభవనమునకుఁ బోయెను.

రాజపుత్రుఁడు దూరమునందే దత్తునిఁజూచి మేనుప్పొంగ నెదురువోయి యాలింగనముచేసికొని మిత్రమా ! దయ తప్పినదియా యేమి? ఇన్నినాళ్ళెందు బోయితివి? నీకొఱ కెదురు చూచువఱకు కన్నులు కాయలు కాచుచున్నవిగదా? రుక్మిణి యంతఃపురికిఁ దిరుగాఁ జారుమతి వచ్చినది. నీమాట చెల్లించుకొనవలసిన సమయమువచ్చినది ఇఁక వర్తమానములతోఁ బనిలేదు. మనమిప్పుడే యక్కడికిఁ బోవుదము. ఏదియో మిషపన్ని చారుమతిని నీకన్నులంబడఁజేసెదను. చాలునా? అని యడిగిన నతండు అంతియచాలు ఆప్రోయాలి నీకు వశ్యురాలిగాఁజేయకున్న నన్నీపేరునఁ బిలువవద్దు అనిమరల శపథము జేసెను. --