పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

సిగ్గుచేఁ గొంతసేపేమియు మాటాడినదికాదు. తలవంచికొని యేదియో ధ్యానించుచు నోరచూపులనతనిఁ జూడఁదొడంగినది. అప్పుడా పురుషుఁడు మందస్వరముతోఁ దలోదరీ ! బెదరెదవేల ? నన్ను రప్పింపుమని చారుమతి నెంతయో ప్రార్థించితివఁటకాదా ! సన్నిహితుఁడనైన నాతో మాటాడవేమి ? నీకామితమేమియో చెప్పుము. నే నిందు మసలరాదు వేగఁ బోవలయుననుటయు నారమణి యెట్టకే సిగ్గుదిగంరింగి యిట్లనియె.

మనోహరా ! మీరును జారుమతియు నింద్రజాలవిద్యల నెఱింగిన ప్రోడలు. మీ రాకపోకలు గ్రహించుట దుర్ఘటముగా నున్నది. ఇంతలో జారుమతి యెందుబోయినది? మీ రెక్కడినుండి వచ్చితిరి ? మొదట నామెమిమ్ము నాప్రక్కబరుండఁబెట్టిన యభిప్రాయమేమియో చెప్పినచో నామనోరధ మెఱిగింతు. నామాట యడుగుటకే మిమ్ము రప్పింపుముని ప్రార్థించితినని చెప్పిన నతండు మేలు మేలు. ఆమాట యామెనడుగవలయుంగాని నన్నడుగనేల? ఆమె యభిప్రాయమునకు నేనెట్లు సమాధానము చెప్పువాఁడ? అని యుత్తరమిచ్చిన నమ్మత్తకాశిని మఱల నిట్లనియె.

బాగుబాగు మీరేమిటికివచ్చితితో మీకే తెలియదా? అట్లైన నామెనడిగెద రప్పింపుఁడు లేకున్న మిమ్మిప్పుడే యంతఃపురావరోధాపరాధమునకు బద్ధుంజేయించెద నేమి జెప్పెదరని యడిగిన నతండు నవ్వుచు నిదివఱకే భవదీయ మంజులవాంఙ్నిగళ బద్ధుండనైతిని మఱల బద్ధుంజేయ నేమిలాభము అని యీరీతి వారిరువురు గొంతసేపు పరిహాస వచన రచనలతో గాలక్షేపముచేసిరి.

ఆసంవాదములో పలువరుసతీరు కనుదమ్ములసొంపు. చెక్కుల గురుతులు స్వరమాధుర్యములోనగు విషయంబులన్నియు బరీక్షించుచు నాఁడు ద్వారపాలు రాడినమాటల స్మరించుకొనుచుఁ దనయన్న