పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తకశాపవిముక్తి కథ.

155

సవరింపుచు మానినీ ! వానింజూపించిన సంతసింతువా ! ఏమి చేయుదువు ! ఇప్పుడే మఱలఁ దీసికొనివచ్చెద నేమి పారితోషికమిత్తువో చెప్పుము. అతండు దివ్యుఁడనిచెప్పలేదా? వానిరాకకుఁ గోటలు నగడ్తలు నాటంకములుకావు. అదియోగశక్తి యని పలికిన నక్కలికి మఱియు వివహాతురయై నీకు వాని నిప్పుడు తీసుకొనివత్తువేని నిత్యము నీ పాదసంవాహనము గావించుచుండెద నింతకన్న వేరేమిచ్చినను నీకు సంతసము గాదుగద. నాదేహము నీకర్పించెద నీకు దాసురాలినైయుండెదనని చెప్పినవిని యాచారుమతి కానిమ్ము ఎట్లైన నీయభీష్టము తీర్చుట ముఖ్యము ఇప్పుడే రప్పించెదఁ గన్నులుమూసికొమ్ము. తెరచినఁ బ్రమాదముసుమీ? యని చెప్పిన నప్పడఁతి కరతలములఁ గన్నులపైఁ గప్పికొని గట్టిగా మూసికొన్నది.

అప్పుడు చారుమతి

గీ. దివ్యపురుష ! రమ్ము ! ధృతివాయ రుక్మిణీ
    రమణి నిన్నుఁగూర్చి రక్త యగుచు
    విరహబాధఁ జెంది పరితాప మందెడు
    గరుణ వేగవచ్చి కావుమయ్య.

అని చదువుచుఁ దన స్త్రీవేషముదీసి తొంటిపురుష వేషమును ధరించి యందున్న పుష్పమాల్యాను లేపనాదుల నలంకరించుకొని రుక్మిణి ప్రక్కంగూర్చుండి సన్నని యెలుంగుతో అబ్బా! యీచారుమతి పలుమారు రప్పించి వేపుచున్నది గదా! యామెమాట నతిక్రమించుటకు మనసొల్లకున్నది చారుమతీ! నీవు వెళ్ళుచుంటివి? నన్నేమిచేయుమనియెదవు ! అదియా ! సరేపొమ్ము. అనిపలుకుచున్న సమయంబున నిలువలేక రుక్మిణి కన్నులం దెరచినది. చారుమతీయందులేదు. నాఁటిరాత్రి తన ప్రక్కఁబండుకొనియున్న పురుషుఁడతఁడే తనయెదుటఁబ్రత్యక్షమయ్యెను. అప్పుడామెమేనసాత్విక వికారములన్నియుఁబొడసూపినవి