పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యేకాదా నీవు వాని నాప్రక్కఁబరుండఁబెట్టితివి. నీకంటే నేనెఱింగిన దాననా? వానింజూపుమని మఱియును బలవంతపఱచెను,

అట్లున్మత్తాలాపము లాడుచుండఁ బకపక నవ్వుచు జారుమతి యూరక తొందరపడియెద వేమిటికి? యీరేయి నిందువత్తునని యతండే చెప్పెనుగదా ! రానప్పుడు చూతుముగాని వానింగూడిన నిఁకనాతో మాటాడవేమో ? వాఁడువచ్చిన నేమిచేయుదువు ? నిజము చెప్పుము ? అని యడిగిన నమ్మగువ సిగ్గుతోఁ బోనిమ్ము నేనేమియు మాటాడను. అంతకును నీదేభారము అని యూరకొన్నది. అంతలోఁ జీఁకటిపడినది. రేవతి యరుదెంచి దేవీ! నియమించిన సమయము దాటినది. ఇఁకరాడు. అది కపటపుపలు కేమోయని నివేదించినది. రుక్మిణి దైన్యముదోప నంతయు నీమెలోనున్నది. మనము వెఱ్ఱిపడుచుంటిమి. ఈమె సెలవులేక యాపురుషుండు మనచెంతకువచ్చునా ? అందుల కీమెనే యారాధింపవలయుననిపలుకుచు నామెకైదండఁగొని బండి యెక్కించి యంతఃపురమునకుఁ దీసికొనిపోయినది.

ఇంటికిఁబోయినదిమొదలావాల్గంటి యొండుతలంపులేక చారుమతితో సఖీ ! ఆపురుషుడెవ్వడు ? ఎక్కడనుండితీసికొనివచ్చితివి ? ఎక్కడికిఁబంపితివి? అతండు స్త్రీ వేషముతో వత్తుననినమ్మించి యేటికి రాలేదు ? అందునీప్రోత్సాహము కొంతయుండవచ్చును. మొదటఁ గావలివారలఁదప్పించి యెట్లులోపలికిఁ దీసికొనివచ్చితివి ? నీవుసర్వదా మాయొద్దనేయుండుదానవే ! యవ్వలికెట్లుపోయితివి ? తలంచికొన నేమియు సందర్భముకలియుటలేదు నీశిష్యురాలిం గనికరించి నిక్కము వక్కాణింపుము. దాచనేల? ఆ దివ్యపురుషునిఁ జూచినది మొదలు నామదినేదియో పరితాపము జనించుచున్నది నీపాదంబులకు మ్రొక్కెద నీబోధ వోగొట్టుమని యడుగులంబడి గట్టిగా నిర్బంధించినది.

అప్పుడు చారుమతినవ్వుచులేవనెత్తి గౌఁగిటజేర్చుకొని చెక్కులు