పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తకశాపవిముక్తి కథ.

153

యవని నాఁడు చెప్పకయే తప్పించికొనిపోయితిని. అక్కటా ! స్నేహానుబంధము కడుచిక్కనిదికదా ? కాశికింబోవలయునని తలంచియుఁ గాళ్ళురాక యిందు నీరాకవిని మఱియొకసారి చూచిపోవలయునని వచ్చితిని. కన్నులు చల్లబడినవని పలికిన విని రుక్మిణి యిట్లనియె.

సఖీ నన్ను వియోగసాగరంబున మునుంగఁజేసి యేగితి వది యట్లుండె నాప్రక్క నెవ్వనినో పరుండఁబెట్టిపోయితి నతం డెవ్వఁడు? అంతలో స్మృతినభినయించుచు రేవతీ! యీయుత్సవములో నామాట మఱచిపోయితివిగదా ? నీవువోయి ద్వారమున వేచియుండుమని దాని నియోగించి మఱియు నామెతో నేనది స్వప్నమనుకొనుచుఁ గొంతసేపు తొట్రుపాటు చెందితిని. అతనిరూపు కన్నులకుఁ గట్టినట్లుండుటఁ జిత్రఫలకమువ్రాసితి నిదిగోచూడుము. నీవలె నతండును తెల్లవారక పూర్వమే యెందో పోయెను.

అది యింద్రజాలమో స్వప్నమో నిజమో తెలియకున్నది. ఆపురుషుఁడెందైనఁ గనంబడునేమోయని రేవతిచేతికాచిత్రఫలకమిచ్చి పట్టణమంతయుఁ ద్రిప్పించితిని. నీయొద్దదాచనేల ? ఆతండొకచోటఁ గనంబడి యాఁడువేషముత నీయుద్యానవనమునకు వత్తుననిచెప్పెనఁట అందులకే మేము పెందలకడవచ్చితిమి వానినిమిత్తముబంపిన నీవు గనంబడితివి. ఇప్పుడు వెండియు రేవతి యందులకేపోయినది. ప్రియ సఖీ ! యిఁకనాకుఁ గొదవయేమియున్నది. నీవేవచ్చితివిగదా ? ఆపురుషునివృత్తాంతము చెప్పుమని గడ్డముబట్టుకొని బ్రతిమాలికొన్నది.

చారుమతి నవ్వుచు నతండొక దివ్యపురుషుఁడు నీకట్టివాఁడు భర్తగానుండిన బాగుండుననితలంచి తారతమ్యపరీక్షకై నీప్రక్కఁబరుండ బెట్టితిని. నీవు జూచుకొంటివిగదా?, నీకనుకూలుఁడనితోచెనా? సౌందర్యమెట్లున్నది ? చెప్పుమనియడిగిన నాపడఁతుక అబ్బా! యీమాటలకేమి ? సఖీ ! వాఁడెందువోయెనో చెప్పుము. అనుకూలుఁడనితోచి