పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

విద్యారూపములం గూర్చి పెద్దగాఁ బొగడుచుండ దత్తుఁడునవ్వుచుఁ జూచినంగాని నమ్మనని యుత్తరము చెప్పెను.

మఱునాఁడు వాడుకప్రకారము నగరికరుగుచు గోణికాపుత్రుండు దత్తునితో మిత్రమా ! నీవు రాజపుత్రునొద్దకు వత్తువా ? అని యడిగిన నతండీనగరవిశేషములం జూడఁబోయెద. నీవేపోయిరమ్ము. రాజపుత్రునితోఁ జెప్పుము. అని పలుకుటయు గోణికాపుత్రుండట్లు కావించెను.

దత్తుండును రుక్మిణీ విరహపరితాపము చిత్తంబుత్తలపెట్ట నావీటిలోని యంగళ్ళవెంట దిరిగితిరిగి యందొకదేవాలయము గోపురద్వారమునఁ గూర్చుండి యచ్చటివింతలం జూచుచుండెను. అంతలో నొక పరిచారిక యాప్రాంతములందిరుగుచు నతనియొద్దకువచ్చి యెగాదిగఁ జూచి తనచేతనున్న చిత్రఫలకము పరికించి మఱల నతని మొగము సూచి తలయూచుచు స్వామీ! మీదేయూరని యడిగినది.

అతండు దానివంక జూచి నీవుచిత్రలేఖనా ! యేమి ? నన్ను సవితర్కముగాఁ జూచుచుంటివేల ? నాకులగోత్రనామములతో నీకేమిపని ? అనియడిగిన నాజవ్వవి నవ్వుచు మీరనిరుద్ధులైనచో నేనుజిత్రలేఖనే. పనియుండియే మిమ్ముఁ బలుకరించితిని. ఈచిత్రపటమును జూడుఁడు? మీప్రతిబింబముకాదా? అనుటయు నతండు దాని బరికించి యిది నాయాకృతియే దీనివ్రాసిన యాకృతులెవ్వరు? అని యడిగిన నాపరిచారిక మెల్లగ మీరెప్పుడైన భోజరాజపుత్రికయగు రుక్మిణీ యంతఃపురమునకు వచ్చితిరా ?

దత్తకుఁడు -- (నగు మొగముతో) శుద్ధాంతముసకు నే నెట్టు రాఁగలను?

పరిచారిక --- పోనీ చారుమతి నెఱుంగుదురా?

ద -- ఎఱుఁగుదును ఆమెయే నేనుగాఁ గొన్నినాళ్లు మెలంగితిని.