పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తకశాపవిముక్తి కథ.

147

యేమిటికి లభ్యముకాలేదు? చెప్పుమనుటయు నతండిట్లనియె. చారుమతి యను వేశ్య నాహృదయ మాకర్షించినది. అది త్రిభువన యువతి జనాతీతసౌందర్యంబునం బ్రకాశించుచున్నది. అందరానిఫలమై నాసహోదరి యంతఃపురమున వసించియున్నది. దానింజూచినది మొదలు నన్నీ వ్యాధి బాధించుచున్నదని యావృత్తాంతమంతయు నెఱింగించెను. ఆ మాటవిని నేనాపడఁతి నొకసారి నాకన్నులంబడునట్లు చేయగలరా? అని యడిగిన నతండాలోచించి యట్లెకావించెదఁ దగినతంత్రమాలో చింపుఁడు. అని పలికి నాకుఁ దగిన నెలవు నిరూపించి యంపించెను.

కాశినుండి యొకపండితుండు వచ్చెననియు నతనికి సంస్థానకవులకు రేపుప్రసంగముజరుగుననియు నందులకుఁదగిన మధ్యవర్తి లేడనియు నీయొద్దనున్న చారుమతి మహావిద్వాంసురాలని వింటిమికావున నాపూవుఁబోఁడిని మధ్యవర్తినిగానుంచి జయాపజయంబులు నిరూపించుటకై కోరితిమి కావున సభవేళకుఁ బంపవలయునని యాతండు చెల్లెలికిఁ జీటివ్రాసి యంగీకరించినట్లు ప్రత్యుత్తరము దెప్పించుకొని యా వాతన్ తమపండితులకుఁ దెలియఁజేసెను.

మఱునాఁడు యధాలమునకు సభకూడినది. అయ్యోలగములోనే యొకదెసఁ దెరగట్టించిరి. రాజపుత్రికతోఁ గూడఁ జారుమతి యా తెరలోఁ జేరినది.. యవనికాముఖంబునం గూరుచుండి మావాదము లాలించినది. నాకును సంస్థానవిద్వాంసులకు రెండుగడియలు ప్రసంగము జరగినది. మధ్యవర్తిని చెప్పకుండఁగనే తామోడిపోయినట్లొప్పుకొని యాపండితులు నన్ను స్తుతిజేసిరి.

అప్పుడా యువతియే రోసమెక్కి రాజుపుత్రిక పోత్రాహామున వాదమునకుఁ బూనికొనినది. మాయిద్దరకుఁ బెద్దతడవు ప్రసంగము జరగినది. వయస్యా ! నీతో నేమనిచెప్పుదును. మనమెన్ని చదివితిమో యదియు నన్నిచదివినది. మనయుపాధ్యాయులే దానియుపాధ్యాయులని