పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్తకశాపవిముక్తి కథ.

143

దగిన పారితోషికము నీకిచ్చుటకు నాయొద్ద నేమియులేదు. ఇదిగో ప్రీతిపూర్వకముగా నిన్నాలింగనము సేసికొనుచుంటిని. ఈపరిష్వంగమే మన ప్రేమానుబంధమును దృఢపరచుఁగాక యని కౌఁగలించుకొనుచు జెక్కులుముద్దుపెట్టుకొన్నది.

చారుమతియుఁ బ్రత్యాశ్లేషముగావించి రాజపుత్రీ! నీసౌందర్య చాతుర్యాది విశేషంబుల కనుగుణుండగు భర్తలభించి యతనితో నతను క్రీడలఁ దేలుచున్నప్పుడు నన్ను స్మరింతువుగాక. నాఁడుగదా నాయుపదేశమునకు ఫలము. అని యుత్తరముచెప్పినది. ఆబోఁటి సిగ్గుపెంపున నేమియు మాటాడినది కాదు. అట్లు వారు పెద్దతడవు సంభాషించుకొనునంతలో నన్యోన్యాలింగితాంగలై నిద్దురవోయిరి.

నాఁటి యపరరాత్రంబున రుక్మిణికి మెలకువవచ్చినది. తనపైఁ జేయివైచుకొని నిద్రించుచున్న చారుమతిచేయియుఁ బాదంబులు బరువుగాఁదోచుటయు రాజపుత్రిక మెల్లగలేచి యందొక చక్కని పురుషుండు పండుకొని యుండుటంచూచి యబ్బురపాటుతో అహా ! ఈ మోహనాంగుఁ డెవ్వఁడు? చారుమతి యేమైనది? ఈసుందరు నాముందరఁ బవ్వళింప జేసి తా నెందో డాగియున్నదా ? వీని నీశుద్ధాంతమున కెట్లు తీసికొనివచ్చినది ? తలంచికొన నేదియు సరిపడకున్నది ? కానిమ్ము. ఏదియెట్లైనను వీనిమేనిసంపర్కము నాకుఁ గలిగినదికదా ? వీఁడే నాభర్తకావలయును. ఆహా! వీని సౌందర్య మెంతచూచిన తనివితీరకున్నవి. చారుమతి నాకు మంచి యుపకారము గావించినది. వీని లేపి నీవెవ్వఁడవు? ఎట్లువచ్చితివని యడుగుదునా ? అయ్యో ! ఊరక వీనికి సుఖనిద్రాభంగము సేయనేల ? తెల్లవారదా తొందరయేల ? అనితలంచుచు వానినాపాదమస్తకముగాఁ బరీక్షించి యుత్తమ పురుష లక్షుణంబులుండుట గ్రహించి యమ్మించుబోఁడి వేరొకమంచముపైఁ బండుకొని ధ్యానించుచుండ నంతలో నిద్రపట్టినది.