పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పిమ్మట నాపురుషునకుమెలకువవచ్చినది. నలుమూలలు సూచుచు నాహా ! నేఁటితో నాకు యక్షశాపము సమాప్తినొందినది. సంవత్సరమైనది కాఁబోలు. జరగిన చర్యలన్నియు నాకుస్వప్నప్రాయములుగానున్నవి. ఇప్పుడీ రాజపుత్రిక నిద్రించుచున్నది లేపి నావృత్తాంతముజెప్పి యేగుదునా ? ఏమో? దానికేమి కోపమువచ్చునో ? స్త్రీలు చపలహృదయలుగదా ? చెప్పకబోవుటయే లెస్స చీకటియుండగనే యొరులెరుఁగకుండ నీశుద్దాంతము దాటిపోవుటమంచిది. దీనిసౌందర్యముచూచి విడిచి పోవలయునని మనసురాకున్నది. ఇదిలేచి నాయందనురాగముచూచించిన మేలగు లేకున్న ప్రమాదమగు నప్రత్యక్షమగు పరబుద్ధినమ్మి యిందుంట నీతికాదు అని తలచుచు నాదత్తకుండు తెలతెలవారుచుండ నంతర్భవనములుదాటి యవ్వలికింబోయెను.

సింహద్వారమునఁ గాచియున్న భటులతనింబట్టికొని నీ వెవ్వఁడవు ? అంతఃపురమున కెట్లుపోయితివి ? ఇది గొప్పతప్పితము నీకథ జెప్పుమని యడిగిన నతండేమి చెప్పుటకుం దోచక తబ్బిబ్బుమాటాడెను అప్పుడతని నపరాధిగాభావించి బధ్ధుం జేసి నారాజభటులు భోజుండు కాళిదాసుందీసుకునిరా దేశాంతరమరిగియున్న కతంబున నప్పుడు రాజకార్యముల విమర్శింపుచున్న రాజపుత్రుఁడగు చిత్రసేనుని మేడకుం దీసికొనిపోయి యయ్యపరాధ ప్రకారమంతయుఁ బత్రికాముఖంపున నతనికిఁ దెలియఁజేసిరి.

రాజపుత్రుండు మంచముపై బండుకొని యొక బ్రాహ్మణ మిత్రుండు ప్రక్కంగూర్చుండి మంచిమాటలు చెప్పుచుండ నాలించుచు దండనాధుండు పంపిన పత్రికనువిప్పి చదివి విసువుతోప మిత్రమా! దండనాధుఁ డపరాధినెవ్వనినో తీసికొనివచ్చెను. నీవువోయి విమర్శించి రమ్ము నా కోపికలేదని యాచీటి సతనిపైఁ బడవైచి తానవ్వలి మొగంబై పండుకొనియెను.