పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

ప్రకారంబుల గొనియాడుచుండ నతనిచెవులకు విద్వాంసుఁడా! నీవచిరకాలములో మిత్రులంగలసి యత్యంతసంతోషంబులం జెందకలవు. అనుమాటలు వినంబడుటయు నతండు గన్నులందెరచిచూచి యామాటలాడిన వారిఁగానక దేవీప్రోక్తంబుగాఁదలంచి యమ్మించుబోఁడుల కత్తెరం గెఱింగించె నప్పుడు చిత్రసేన యిట్లనియె.

ఆర్యా! ఇందలిశిలాశాసనము జదివిజూచితిని. మనోహరరూప యౌవన ద్యోతినియగు వారయువతింబలియిచ్చినవారి కీదేవికోరినవరంబుల నిచ్చునఁట. అందులకే యాయోగినిపలుమారు మాచెంతకువచ్చి ఢాకినీదేవియొద్దకుఁ దీసికొనిపోయెదనని చెప్పునది. దైవము దానికిబ్రతికూలుఁడై యుండ గోరికయెట్లుతీరును. విపరీతము జరగినది. దానిం జంపక విరూపంజేసి విడిచితిరి. శూర్పణఖ రావణునికిఁబోలె నిది యా రాజునకుబోధించి మఱలఁ జిక్కు దెచ్చిపెట్టునేమో ? వేగమీదేశము దాటిపోవుట లెస్సయని యుపదేశించుటయు నతండామాటల కంగీకరించెను. బండివానికిఁజెప్పి వారుబండియెక్కి హుటాహుటి పయనంబుల నాదేశముదాటి యొకనాఁటిరాత్రికి ధారానగరంబు సేరిరి. అని యెఱిగించి తరువాతికథ పైమజిలీయందిట్లు చెప్పందొడంగెను.

146 వ మజిలీ

దత్తకశాపవిముక్తి కథ.

చారుమతియు రుక్మిణియు నెప్పుడు నొక్క మంచముమీఁదనే పండుకొనుచుందురు. ఒకనాఁటిరాత్రి యిరువురు పండువెన్నెలలోఁ బూవుపానుపునఁబండుకొని ప్రొద్దుపోవువఱకు విద్యావిషయంబుల ముచ్చటించుచుండిరి. రుక్మిణిసూత్రవిషయంబులన్నియు స్మరణకుఁదెచ్చికొని సఖీ! ఛారుమతీ! నీవంటి విదుషీమతల్లివలనఁగాని యీ సాంప్రదాయములు తెలియఁబడునా; మొదటఁజూచిన నీపుస్తకమేమియుం దెలిసినది కాదు. ఇప్పుడంతయుం గరతలామలకముగా నున్నది. ఇందులకు