పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

స్వామీ ! అల్లుఁడు గోడలగుట చిత్రము కాదా ? దానిభావంబు వివరింపుఁడు. తెలిసికొని యాపండితులకుం జెప్పెద. మఱియు నీగ్రామమునం గలవిశేషంబుల సొంతముగాఁజూచి వచ్చెద ననియడిగిన నయ్యతిపతి రత్నప్రభావంబునఁ దదుదంత మాకలించుకొని గోపా ! యీశ్లోకపాదమువలన నద్భుతకథాసందర్భగర్భితం బగుసప్తమిత్రచరిత్ర మనునుపాఖ్యానము స్ఫురించుచున్నది. అది నీ వింతకు మున్ను విన్నకథలకన్నఁ జాల చమత్కారముగా నుండు నవహితుండవై యాలకింపుము.

- దత్తుని కథ. -

సీ॥ తెలితమ్మిపూవురే ◆ కులమించు సోగ క
                 న్నులు మోమునకువింత ◆ చెలువుగూర్ప
      నరచందరుని మేల ◆ మాడునెన్నుదుట ది
                 ద్దిన విభూతులబ్రహ్మ ◆ తేజమెదుగ
      నీర్కావివలువ వ ◆ న్నియకుందనమువంటి
                యొడలిచాయకుఁగ్రొత్త ◆ యొఱపుగొలుప
      బహుళ శాస్త్రామ్నాయ ◆ పఠనచిహ్నితములై
                యోష్ఠముల్ దీప్తి సం ◆ యుక్తి నెసఁగ

గీ. నవనిఁ గుమ్మఱవచ్చిన ◆ యతనుఁడో జ
    యంతుఁడొ కుబేరపుతుఁడో ◆ యబ్జుఁడో వ
    సంతుఁడో యనఁదగి బ్రహ్మ ◆ చారి యౌవ
    నాంకురాలంకృతాంగ కుం ◆ డైనవాఁడు.

ఒకానొక బ్రాహ్మణ కుమారుండొక మహారణ్య మధ్యంబున వసించి యిట్లుతలంచెను.

ఆహా ! నేను గాశీపురంబునుండిబయలుదేరి యిరువది దినములైనది. మొదటనాలుగైదు పల్లెలు మాత్రము గనంబడినవి. తఱువాత