పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కాశీమజిలీకథలు

ఎనిమిదవభాగము.

142 వ మజిలీ.

సప్తమిత్రచరిత్రము.


క॥ శ్రీమ త్కాశీనగర! స్వామి రమాప్రాణనాథ వాణీ ధవ సు
     త్రామా దిదేవ మకుట! భ్రామిత మణినికరకిరణ భాసిత చరణా!

దేవా! యవధరింపు మ మ్మణిసిద్ధుం డయ్యవసధంబున గథా కథనలాలసుండై యున్నంత నగ్గోపకుమారుం డరుదెంచి.

"శ్లో॥ జామాతైవ స్నుషాభవత్”
       అల్లుఁడే కోడ లయ్యెను.

అని చదువుచు మహాత్మా! వింతలంజూడ నేఁడీ గ్రామము లోనికిం బోయితిని. రచ్చబల్లపైఁ గూర్చుండి కొందఱు విద్వాంసు లీశ్లోకపాదముం జదువుచుఁ దద్భావము గ్రహింపలేక వితర్కించు చుండిరి.

ఉ॥ అల్లుఁడు కోడలెట్టులగు ◆ నంచు వచింప గ గొందఱందు నౌ
      నిల్లరికంపుటల్లుఁడు గ్ర ◆ హింపఁగఁ గోడలివంటివాఁడె యౌ
      నల్లుఁడు కోడలయ్యెనని ◆ యర్ధముచెప్పఁగఁ గొంద ఱొల్లరై
      రల్లన వాదమయ్యెఁ దెలి ◆ యంబడదయ్యెఁ దదర్థ మేరికిన్. (1)