పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

బలియియ్య కత్తి యెత్తి యేయబోవునంతలో నేనుబోయి బట్టుకొంటిని. అరనిమిషముదాటిన నాబోఁటి జమువీటికరుగవలసినదే పైనదైవము లేడా అనిపలికినవిని యక్కలికియులికిపడి అయ్యో! నాసోదరి నాదరింపక విడిచివచ్చితిరా ? ఆదుష్టురాలు మఱల నేమిచేయునో పదుఁడని నొడివి వడివడివారితో నమ్మవారిగుడికడకుఁ బోయినది.

రతిమంజరి యట్టెపండుకొని బాహ్యప్రచారములేక యంతరాత్మ నీశ్వరునర్చింపుచుండెను చిత్రసేన దానిస్థితినరసి యురమునఁ గరంబిడి అమ్మయ్యో యెట్టియాపదదాటినది. తల్లీ ! చెల్లీ ! లెమ్ము లెమ్ము. తల్లికడుపున వెండియు బుట్టితివి. అనిపలుకుచుఁ జేతులాని దానిలేవనెత్తి విలపింపఁ దొడంగినది. అప్పుడు రతిమంజరి కన్నులందెరచి అక్కా ! మీరిక్కడికెప్పుడువచ్చితిరో నేనెఱుంగనుసుమీ? నాకాళ్లు సేతులుగట్టి మెడకువేపరొట్టగట్టి బలవంతమున నేలఁబండికొనఁబెట్టిరి. అంతవఱకు నెఱుంగుదును. పిమ్మటనేమయ్యనో తెలియదనిపలుకుచు దనకట్టులువిప్పుచున్న గోణికాపుత్రునికి నమస్కరించి కన్నులనశ్రువులు విడిచినది.

అప్పుడతండామచ్చెకంటి గ్రుచ్చియెత్తి కన్నీరుదుడుచుచు మనము భగవదాజ్ఞకు బద్ధులము సంసారనాటకమునకతండ సూత్రధారుఁడు. జీవులకుఁగీడుమేళులు క్రమోపగతములు రెండుగడియలక్రిందట మనము మహావిపత్సముద్రములో మునిఁగియుంటిమి ! ఇప్పుడు మబ్బువిడినట్లు మనయాపదలు పటాపంచలైపోయినవి. కపటయోగినిని లక్ష్మణుఁడు శూర్పణఖనువోలె ముక్కు చెవులుగోసి విరూపనుజేసితిని అదియిందునిలువక యెందోపారిపోయినది. రాజభటుల నిద్దరను మేమిద్దరము క్రుద్ధులమై యీకత్తులచేఁ గడతేర్చితిమి? ఇంతకు నీబండివాఁడు నాకుమంచిసహాయముగావించెను. నాకట్టులవిప్పి -తోడునీడై శత్రుసంహారముగావించెను. కత్తి ద్రిప్పుటలో వీనికిఁగలనైపుణ్యము