పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

తరువాత వారి వీణాదిగానసాధనము లన్నియు నందలిపల్లెలోఁ బడవైచి వేశ్యాపుత్రికల నిరువురను యోగినిని నొకబండిలో నెక్కించి గోణికాపుత్రుని వెనుక నడిపించుచు విచ్చుకత్తులఁ జేతులఁబూని ముందొకఁడు వెనుక నొకఁడు నడుచుచు మహాపుర నగరాభిముఖులై పోవుచుఁ గొన్ని పయనంబులు సాగించిరి.

ఒకనాఁడొక యరణ్యమార్గంబునం బోవునప్పుడ మతంగయోగిని రాజభటుల రహస్యముగాఁ జీఱి దూతలారా ! రాజు మీతో నేఁ జెప్పినట్లు చేయుమనికదా ఆజ్ఞాపించెను. ఈప్రాంతమందు ఢాకినీదేవి యాలయమున్నది. అమ్మహాదేవిని దశిన్ంచి సేవించి యరుగుదము గాక. మనము దలఁచినకార్యము సఫలము గాఁగలదని నియమించిన వా రంగీకరించి యాదారినే బండిని నడిపింపజేసిరి. అమ్మవారి యాలయము కొంచెము దూరములో నుండఁగ బండియాపించి యోగిని రాజభటులతో నేకాంతముగా నిట్లు చెప్పినది..

నేను మహారాజు నిమిత్తమై యీగణికలలో నొకదానింగూర్ప నింతప్రయత్నము చేసితిని అతండు పెద్దదాని దాను స్వీకరించుటకును రెండవదానిని నాకిచ్చుటకు నంగీకరించెను. నేను ఢాకినీదేవతను జిరకాలమునుండి యారాధించుచుంటిని చక్కని వేశ్యాపుత్రిక నొకదానిం బలియిత్తునేని యమ్మవారు నేను గోరినవరము లీయఁగలదు. అందులకే నేనీ విశ్వప్రయత్నము చేసితిని. మీ దయవలన నా మనోరధము దీరఁగలదు వినుఁడు మీకంటె రాజు నా కెక్కుడు చుట్టము కాఁడు మీకును నాకును నుపకారమగు తెరువాలోచించితిని. ఈ బ్రాహ్మణుఁడు చాలగట్టివాఁడు రాజునొద్దకుఁ దీసికొనిపోయినఁ దనపాండిత్యము చూపి ఱేనిమతి త్రిప్పఁగలడు కావున నిప్పుడే మనయభీష్టము దీర్చుకొందము. పెద్దదాని మీయిరువురు తీసికొనిపొండు. రంభవంటిదాని