పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఢాకీనీదేవతకథ.

135

శాసనమునకు బద్ధులము కావలసినదే అట్లెవత్తుము పదుఁడు అని పలికి, బండివానితో వెనుకకుఁ ద్రిప్పుమని నియమించెను.

అంతలో మతంగయోగిని యక్కడకువచ్చి వారిం జూచి దొంగలు దొరకిరా? కానిండు. వీరిం బదిలముగాఁ దీసికొనిపోవలయు రూపులుమార్చి తిరుగుచున్నారని గంభీరముగఁ బలికినది గణికాపుత్రిక లాయోగినింజూచి యోసీ! మాయావినివై కపటయోగవతివని గ్రుమ్మఱుచున్న నీవు మోసకత్తెవు కాని మేము కానేరము. మేమెవ్వరిసొమ్మును దీసికొనిరాలేదు. మమ్ము రాజన్యాయముగా శిక్షింపఁబూనిన దైవములేడా? కపటముచేసి చెప్పినట్లు చేయలేదని నీవే యిట్టి కల్పితము చేసితివి. కానిమ్ము, అని ఏమేమో నిందింపఁబూనిన యోగిని రాజభటులఁ బురికొలిపినది.

వాండ్రు క్రోధముఖులై యదలించుచుఁ జాలుఁజాలు మాటాడకుఁడు ఇంటికడ సుఖముండలేక తల్లిమాట వినక బోడిబాపనవానిఁ దగిలికొనిపోవుచు నేమేమో యరచెదరేల? పదుఁడు పదుఁడు. మీపాటులు ముందున్న వి. ఇప్పటికైన వీనిని విడిచి మీతల్లి సెప్పినట్లు విందురేని బ్రతికిపోవుదురు. అని విచ్చుకత్తులు చేతంబూని బెదరించిరి గోణికాపుత్రుండు వారిమాటల కడ్డమువచ్చి మీ రేమియుఁ జెప్పనవసరములేదు. రాజునొద్దకువచ్చి వారికిఁ దోచిన మాటలఁ జెప్పుదురు. అన్యాయముండిన శిక్షించుఁగాక యపరాధులమని తోచిన దండించుఁ గాక మీ కాగొడవలేమిటికి? పదుఁడని యుపన్యసించెను.

ఓహో ! బాపనవాఁడు పొగరెక్కి కూయుచున్నాఁడు. తానపరాధియని యెఱుఁగఁడు ఇదియెట్టి నేరమో తెలిసికొనకున్నాఁడు పారిపోవఁగలఁడు చేతులకు నిగళములు దగిలింపుఁడు. అని యదలింపుచుండ వారికిఁ దోడువచ్చిన గ్రామాధికారులతఁడు మహాపండితుఁడని తెలిసికొని యతండు పారిపోవకుండ తాము పూటకాపులుగా నుందుమని బోధించి యెట్టకే విడిపించిరి.