పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతంగుని కథ.

133

నేడువఁదొడంగిరి. చింతామణియుఁ బ్రాజ్ఞురాలయ్యు దేహవాసనంజేసి వారితోగూడఁ గొంతసేపువిలపించి పిమ్మటవారి నూరడించుచు నతండు మహర్షి యనియుఁ బాదరక్షలమూలమున మీయింటబుట్టెననియు మీ ఋణముతీర్చుకొని ముక్తుడయ్యెననియు నావృత్తాంతమంతయు నెఱిఁగించి వారికిశోకోపశమనము గావించినది. వాండ్రును తదుపదేశబలంబున విరక్తిజనింప నిల్లువిడచి తీర్థయాత్ర సేవించి ముక్తులైరి.

చింతామణియు నామహాత్ముండుచెప్పిన నాలుగుశ్లోకముల యందును బ్రస్థానత్రయమందుఁగల తాత్పర్యముండుటంబట్టి వానినే స్మరించుకొనుచు మహాయోగినియై దేశపర్యటనము గావించుచు ముక్తురాలయ్యెను.

చిత్రసేనా ! వేశ్యయైనను జింతామణి వైరాగ్యబుద్ధిచే నెట్లు వర్తించెనో చూచితివా ? ఎటువంటిజ్ఞానవంతు రాలయ్యెనో తెలిసికొంటివా! అని గోణికాపుత్రుఁడు చింతామణి యుదంతమెఱింగించిన విని యాగణికా పుత్రిక లిరువురు పరమానందపూర్ణహృదయులై యతని నగ్గించిరి.

అని యెఱింగించునంత సమయాతీతమగుటయు మణిసిద్ధుం డవ్వలికధ యనంతరపుమజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

148 వ మజిలీ

−♦ ఢాకినీదేవతకథ ♦−

ఒకనాఁడు మతంగయోగిని యిరువురు రాజభటులతో నొకమార్గంబునంబడిపోవుచు నిట్లు సంభాషించినది. దూతలారా! మన మహారాజుగారి దేశావసాసము సమీపించుచున్నది. వాండ్రీపాటి కీదేశము దాటిపోవుదు రేమో? అన్యదేశమున మనము వారింబట్టి కొనవచ్చునా ? అని యడిగిన రాజకింకరులిట్లనిరి. దేవీ! మన మితరదేశమున వారింబట్టికొనరాదు. అందున్న యధికారులకు మనరాజశాసనము