పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

తల్లీ ! నేనేమితప్పుచేసితినని రాజునాకుశిరచ్ఛేదము చేయించును? నేనన్నమాటలు నీవువినలేదా ! వెఱవకుఁడు అనికుమారుఁడు ధైర్యము గఱపుచుండెను.

తల్లిదండ్రులిద్దరు వానింగౌఁగిలించుకొని దుఃఖించుచుండిరి. అప్పుడు రాజకింరుండు వాకిటనిలువంబడి మాతంగా! నీకుమారుఁడు రాక జాగుచేయుచున్నాడేమి? ఆలసించిన రాజుగారికిఁ గోపమురాదా వేగమురమ్మనియదలించిన సిత్తము సిత్తమనుచు నిదిగోవత్తున్నామని పలుకుచు మాతంగుఁడు.

గీ. నెండిమురుగులు కంటెయు వింతచెలువు
    గొలుపగజ్జెల మొలత్రాట గోచివెట్టి
    చుంచుదువ్వి మొగంబునఁ జుక్క దిద్ది
    ముద్దుబాలునిఁ గై సేసి మోహమమర.

చంకవెట్టుకొని యాబంటువెంటవాఁడా నృపతియొద్దకుఁబోయెను. వానిభార్యయు నింటనుండలేక వారిపజ్జన యరిగినది. అట్లాశ్వపచదంపతు లక్కుమార శేఖరునెత్తుకొని కొల్వుకూటంబునకుఁ బోయి రాజునెదుర నిలువంబెట్టి బాబా! వారే పబువువారు జోహారు సేయుము అని పలుకుచు మ్రొక్కించుటయు

ఉ. బాలకుఁజూచిచూచి నరపాలశిఖామణి భూరివిస్మయా
     లోల మనస్కుఁడై భళిర లోకములేలఁగఁ జాలువీఁడు చం
     డాలకులంబునన్ బొడముట ల్విపరీతముగాదె సత్తప
     శ్రీలవనోరు విఘ్నమది చేకురునేయతికో తలంపఁగన్.

కానిచో నుపనిషత్ప్ర తిపాదకంబులగు నట్టిశ్లోకంబులెట్టుచదివెడిని? వీఁడుకారణజన్ముఁడు. పాప మేతపోథియో విధిబద్ధుండై వీని యింటఁబుట్టెనని వితర్కించుచు సింహాసనముడిగ్గి వానిచెంతకరుదెంచి సాదరముగా మాణవకోత్తమా! రాత్రి గస్తుతిరిగినవాఁడవు నీవేకాదా?