పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతంగుని కథ.

129

మాతం - (గడగడ వడంకుచు) సామీ! తప్పు జేసితిని మన్నింపవలయు. నేటియాటంకమున నేను రాత్రి నింటికిరాలేకపోయితిని. మాన్నెముపోవునని మాయాఁడుది బిడ్డనెత్తుకొని రాత్రిగస్తుత్రిప్పినదఁట తండ్రీ ! ఇదియే నిజము. వాఁడేమితప్పు జేసెనో తెలియదు. లేక లేక యొక్కఁడే కలిగెను. ఆసిచ్చ నాకు విధించి వానింగాపాడుఁడు అని యేడ్చుచు నేబంజాగిలిబడి నమస్కరించెను.

రాజు -- (నవ్వుచు) రాత్రి గస్తుతిరిగినవాఁడు నీకొడుకా? వాని కెన్ని యేండ్లున్నవి?

మాతం - బాబూ ! ఎనిమిదేండ్లికను వెళ్ళలేదు.

రాజు - నీవు వాని నిటకుఁదీసికొనిరా. పో పొమ్ము.

మాతం - తండ్రీ ! ఆసిచ్చ నాకువిధింపుఁడు. వాఁడు కుఱ్ఱవాఁడు. ఎఱుఁగనివాఁడు. తప్పుమన్నించి రచ్చింపుడు. అని కన్నీరుగార్చుచు వేడుకొనియెను.

రాజు - మాశిక్షలు పడువాడుకాడు. మమ్ము వాఁడే శిక్షించును. పోయి తీసికొనిఁరా.

అనిపలికిన నేదియో చెప్పుకొనఁబోవుటయు మాటాడనీయక రాజభటుఁడు పదపద అని గెంటుకొనిపోయెను. వాఁడు దిగులుమొగముతో నింటికింబోయి పెండ్లాముపైఁ జిరాకుపడుచు ఛీ! నీమూలమున నింతముప్పు వాటిల్లినది. మాన్నెము పోయినంబోవుఁగాక కన్నులుదెరవని బాలునిం దీసికొనిపోయి యర్ధరాత్రము గస్తుత్రిప్పింతువా! రాజుగారు వీనిమాటలు వినెనుగాఁబోలు గట్టికోపమేవచ్చినది. వాఁడుమమ్మె శిచ్చించునని వెటకారములాడిరి. అనిచెప్పిన భార్య గోలుననేడ్చుచు బిడ్డంగౌఁగిలించుకొని బాబూ! నేజెప్పినట్లు కేక వేయక యేదియోచదివితివి? రాజుగారికిఁ గోపమువచ్చినదఁట. నీకు శిరచ్చేదము చేయింతురఁట వింటివా! అనిపలికిన విని కుమారుఁడు నవ్వుచు నిట్లనియె.