పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నుప్పరిగపై వసించి యామాతంగబాలుఁడుచదివిన మొదటిశ్లోకమును విని వెరగుపడుచు నిద్రబోక తక్కినమూడుజాములయందును జదివిన మూడుశ్లోకములు చెవియొగ్గియాలించి యాహా ! ఇది యేమివింత గస్తు తిరుగు పుల్కసునకీ వైరాగ్యశ్లోకము లెట్లువచ్చినవి ? అని సంశయింపుచు మఱునాఁడుదయమున రాత్రిగస్తుతిరిగిన మాలవానిదీసికొని రమ్మని రాజభటునొకనిం బంపెను.

రాజసేవకుఁడు మాలపల్లెకుఁబోయి రాత్రిగస్తుతిరిగిన వాఁడెవఁడని యడుగుచు మాతంగునియింటికిం బోయెను. మాతంగుఁ డూరినుండి యప్పుడేవచ్చి రాత్రిజరిగినపనులు భార్యజెప్పుచుండ నాలింపు చుండెను. రాజభటుడట నిలువఁబడి రాత్రి గస్తుతిరిగినవాఁడెవఁడురా? యిటురా. అని కేకపెట్టెను. మాతంగుడు జడియుచు బాబూ ! నేను నేనని యెదుటకుఁబోయెను. నీమూలమున నాకర్మము మూడినది నిన్ను వెదకుచు నీమాలపల్లెయంతయు దిరిగితిని. పదపద. రాజుగారి సెలవైనదని పలికిన వాఁడు గడగడలాడుచు బాబూ! ఎందులకో తెలియునా? అని యడిగెను.

భాంచోత్ అది నా కేమియుఁదెలియదు నడువుమని వానివెంటఁ బెట్టికొని రాజసభకుఁ దీసికొనిపోయెను. సేవకుఁడు వాని నెదురనిలువం బెట్టి దేవా! వీఁడే రాత్రిగస్తుదిరిగినమాలఁడని యెఱిగించుటయు నారాజు వానిఁబరిశీలించిచూచి రాత్రి గస్తుతిరిగినవాఁడవు నీవేనా అని యడిగెను. సిత్తము సిత్త ము మాప్పభో ! నేనే యని వాఁడుత్తరము చెప్పెను.

రాజు - నీవెంతకాలమునుండి గస్తుతిరుగుచుంటివి ?

మాతం - ఏలికా! నలువదియేండ్లనుండి తిరుగుచుంటిని.

రాజు -- నీవు రాత్రి గస్తుతిరిగితివా ? నిజమ చెప్పుము. చెప్పకున్న దండింతుఁజుమా?