పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పిల్లవాఁడు - నీవు నాతోనుండి వీధులం జూపుమంతియచాలు నేను ప్రజలఁ బ్రబోధింపఁగలను.

అనిపలుకుటయు సంతసించుచు మాలిని యారాత్రి గోటలోఁ బదిగంటలు గొట్టినతోడనే కుమారు నొకచంకనెత్తుకొని యొక చంక డప్పుదగిల్చికొని బయలుదేరెను. అమ్మా ! నేనడువఁగలను దింపుము. దింపుము. నీవుమోయఁజాలవని కొడుకుపలుకుచుండ జిన్ని నాయనా ! నీవునాకుభారమగుదువా ? నిన్నీ రాత్రినిల్లుకదల్చుటయే తప్పు పైగాఁ జీఁకటిలో నడిపింపనా? నీతండ్రివినిన నన్నుబ్రతుకనిచ్చునా ? అనిపలుకుచుఁ దొలుతఁ గోటకుఁ దూరుపుననున్న వీధికిఁదీసికొనిపోయి యొకచోదింపి తానేడప్పు వాయించుచుఁ బ్రజలుమేలుకొనునట్లు కేక వేయుమని కుమారునికి బోధించినది. ఆప్రాజ్ఞుండు

శ్లో॥ కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్క.రాః
     జ్ఞానరత్నాపహారేణ తస్మాజ్జాగృధజాగృథ.

ఓజనులారా ! కామక్రోథలోభమోహాదు లార్వురు దొంగ లీదేహమను గేహంబునఁ దిఱుగుచున్నారు. వారు జ్ఞానరత్నమును హరింతురు కాచికొనియుండుఁడో ! అని పెద్దకేకపెట్టెను.

బాబూ ! నేనుజెప్పినట్లుకాక వేరొకరీతిజదివితివేల ? ఈచదువు నీకెట్లువచ్చినది? క్రొత్తమాటలు సెప్పఁగూడదు. దొంగలు పడుదురు మేల్కొనియుండుఁడని కేక వేయుమని తల్లిపలికిన నామాటయే చెప్పితినని కుమారుఁడు సమాధానమిచ్చెను.

మాలిని యా బాలకుని రెండవజామున దక్షిణపువీధికిఁ దీసికొనిపోయి యొకచోనిలువంబెట్టి తాను డిండిమము గొట్టుచుఁబ్రజలఁ గేక వేయమని బోధించినది. ఆమాణవకుండును

శ్లో. మాతా నాస్తి పితా నాస్తి నాల్తి బంధుః సహోదరః
    అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మా జ్జాగృధజాగృధ.