పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

తయు నర్ధిసాత్కృతముగావించినాఁడు సుతసువిరక్తయై క్రుమ్మఱుచుండెను.

అగ్నిశిఖుండను యతీశ్వరుఁడా ప్రయాగమున వ్యాసమఠములోవసించి కుతపకాలముదనుక గంగాజలంబులఁ దపంబు జేసికొనుచుఁ బిమ్మట మఠమునకువచ్చి కందమూలాదులు దిని యాఁకలి యడంచు కొనుచు నాత్మావలోకనమునఁ గాలము గడుపుచుండెను. చింతామణి యొకనాఁడా యోగిచెంతకుఁబోయి పాదంబులంబడి మహాత్మా ! నాకు విజ్ఞాన ప్రవృత్తియెఱిఁగింపుఁడని వేడుకొనునది బాహ్య ప్రచారము లేనివాఁడగుట నతనికి దానిమాట వినంబడలేదు. తనమనంబున ధ్యానించుచున్న విషయానుగుణ్యముగా.

శ్లో. యాంతేమతిస్సాగతిః .

అని చదివెను. ఆశ్లోకమువిని చింతామణి మహాత్మా ! నేను జ్ఞానాతీతమైన విజ్ఞానప్రవృత్తి యెట్టిదో యెఱింగింపుఁడని కోరికొంటిని. దేహాంతమందు మనసెట్టి గతి ననుసరించునో యట్టి గతివచ్చునని యుత్తరముచెప్పితిరి? నాప్రశ్నమున కీయుత్తరము సరిపడలేదు లెస్సగావిచారించి సదుపదేశము గావింపుఁడని వేడికొనినది. ఆమాటయు నయ్యతికి వినంబడలేదు. తనతలంపున

శ్లో. ప్రారబ్ధంభోగతో నశ్యేత్.

అను శ్లోకపాదమును చదివెను. అప్పుడవ్వారాంగన అయ్యో ఈ మాటలు వాడుకగా నందఱు చెప్పుకొనునవియే ఇవి నాకుఁ గ్రొత్తలుకావు. విధింపఁబడిన కర్మఫలం బనుభవమూలమున గాని నశింపదు. అతీతజ్ఞాన ప్రకారం బెఱింగింపవలయుఁగాని సామాన్య వాక్యములు నాకవసరములేదని పలికినది. దానియునికియు మాటలుం గూడ నతండెఱుగఁడు తానేదియో మనంబున ధ్యానించుచు

శ్లో. బుద్ధిఃకర్మానుసారిణీ

అని మఱలఁ జదివెను. అప్పుడు చింతామణి అయ్యగారూ !