పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

క. పది దినములలో లోకా
   స్పదుఁడాపరమాత్మ నా కుఁబ్రత్యక్షంబై
   ముదమొదవింపకయున్నన్
   వదలెదబ్రాణముల దేహవాసనవోవన్ .

అనికృతనిశ్చయుండై జపించుచుండ దశదివసావసానంబునభక్త సులభుండగు నాజగదీశ్వరుండు

గీ. శిఖినెమలిపింఛ మొప్పంగఁజిన్నిబొజ్జ
    బసిఁడిగజ్జెలమొలత్రాడు మిసిమిజూప
    మురళిబాడుచు నల్లనిముద్దుబాలుఁ
    డొకఁడు జనుదెంచి యాతనినికటమునకు.

పదకటంబులు ఘల్లుమనిమ్రోయ నృత్యంబుగావించుచువచ్చి లీలాశుకునిచెవులో మరళీనాదామృతము జొనుపుటయు నతండదరిపడి కన్నులట్టెదెరచి కురంగట నెవ్వరింగానక మరలఁగన్నుల మూయుటయు నాలీలాబాలకశిఖామణి యతనిచెంత బలువింతలఁ జూపుచుండెను.

అప్పుడాలీలాశుకునకు, బ్రాక్తనజన్మాభ్యస్తములగు విద్యలన్నియుఁ గంఠస్థమ్ములగుటయు భక్తివివశుండై నిరంకుశకవితాధోరణిచేఁ దనమ్రోలనిలచి యనేకలీలలగనుపరచుచున్న ముద్దుకృష్ణుని యాకారంబు కనంబడిన విధంబువర్ణించుచు నాలుగువందలశ్లోకములురచించి స్తుతియించెను. వానికే శ్రీకృష్ణకర్ణామృతములనిపేరు.

తనకుఁదొలుత నాలీలాకిశోరంబు దర్శనమిచ్చినతోడనే యీ క్రిందశ్లోకమును రచించెను.

శ్లో॥ చింతామణి జన్‌యతు సోమగిరిర్గురు ర్మే
     శిక్షాగురుశ్చభగవాన్ శిఖిపింఛమౌళిః
     యత్పాదకల్పతరు వల్లవ శేఖ రేషు
     లీలాస్వయంవర రసం లభ తెజయశ్రీః.