పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చింతామణి కథ.

111

సోమగిరియనుపేర నొప్పారు నయ్యతీశ్వరుం డాపన్నరక్షకుండగుట నీకుయ్యాలించెడు నతనిచరణంబులు శరణంబులుగా వేడికొనుము ఇప్పుడపొమ్మని యుపదేశించి గురుతులెఱింగించుటయు లీలాశుకుండు మఱుమాటపలుకక చింతామణిపాదంబులు కన్నులకద్దికొనుచు నాక్షణమునందే త్రివేణికరిగి యయ్యతిపతిని వెదకిపట్టుకొని పాదంబులంబడి ప్రణమిల్లుచు నిట్లనియె.

సీ. ప్రభవించితిని భూసుపర్వాన్వయంబున
                 విశ్రుతుండగుకృష్ణమిశ్రునకును
    చదివితి వేదశాస్త్రపురాణముల బాల్య
                 ముననుత్తమాచార్యముఖముగాఁగ
    నిరసించితి విరక్తిఁబరిణయం బాడంగ
                 గాహన్‌స్థ్యధర్మ మక్రమమటంచుఁ
    జేపట్టితిని పుష్పచాప చాపలమున
                 జింతామణీ వారకాంత సతిగ

గీ. తదుపదేశప్రభావ జాతప్రబోధఁ
    దుచ్ఛభోగేచ్ఛ హేయమై తోప నిప్పు
    డాశ్రయింపఁగవచ్చితినయ్య ! తావ
    కాంఘ్రిపద్మద్వయంబు దయానిధాన.

అని తనయుదంతమంతయు నెఱింగించినవిని యమ్మహాయోగి తద్వివేకోదయంబునకుఁ బురాకృతంబ కారణంబని నిశ్చయించిసువ్యక్త భక్తిప్రసక్తంబగు మహామంత్రబొండుపదేశించి శ్రద్ధాలుండవై దీనిం జపింపుము కృతార్ధుండవయ్యెదవని యానతిచ్చుటయు లీలాశుకుండా మంత్రమునకుఁ జింతామణి యనుపేరుపెట్టి గట్టిపట్టున గంగాతీరంబునం గూర్చుండి నిద్రాహారములుమాని తదేకదీక్షగా నామంత్రంబుజపించు చుండె మఱియు