పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కృత ప్రాకృతాది బహుభాషా విశేషజ్ఞులగు శ్రీమాన్
యమ్. ఎ. మానపల్లి రామకృష్ణ కవిగారిచ్చిన యభిప్రాయము.

విద్యాగంథములేని స్త్రీబాలపామరజన సామాన్యమును నిరంతరరాజ్యభార ఖిన్నులగు ప్రభువులను వ్యవహారక్లేశసాగరతరంగితాంతరంగులగు శ్రీమంతులను ఉపదేశపఠన చింతనాది శ్రమములేకయే కేవలము హృదయైక వేద్యమై రసభావబంధురముగా క్షణకాలమహ్లాద సముద్రమున దేలించి ధర్మానుష్ఠానమున నెలకొల్పి యాత్మ విద్యాపారంగతుల గాఁ జేయఁజాలినది కథావినోదమేయని మహర్షులు దాని జతుష్షష్ఠి విద్యలలోఁబరిగణించి యనుశాసించి యభివృద్ధిపఱచిరి. ఇట్టికధావినోదము వినోదమాత్రఫలజనకముగాక ధర్మాదిసాధనోపాయ మహత్తమంబగుట సర్వజన వేద్యమే. కేవలము రాజనీతిబ్రతిబోధించు పంచతంత్రాదికథలును విప్రలంభసంభోగ శృంగారనామ ద్విధాభూతరసరాజు రహస్యపరమార్ధ విచారమనోభిరామంబగు బృహత్కధా నిబంధనంబును ధర్మలోకలవసాధిత బృహద్ధర్మ సంస్తానాది ధర్మసూక్ష్మపరిబోధన చమత్కారంబగు దశకుమార కథావిస్తరంబును ఏకకథారసపరిపూర్ణంబై సాహిత్య విద్యాధి దేవతావిలసితంబగు కాదంబరియు గేవలము ధర్మప్రధానంబగు పురాణజాతమును ఏకదేశరమ్య ప్రస్తావములె యగుచున్నవి. మఱియుఁ గాల కౌటిల్యమున భిన్న దేశభిన్నాచార సంక్రమణంబునంజేసి చిరకాలావధిం బహుపురుషాంత రంబులంగాని తెలిసికొనరాని సదాచారధర్మానుష్ఠాన తారతమ్యంబు నెఱుఁగలేక యవిశ్వాస మూఢమగు చిత్తంబు కుక్షింబరక్రియా సాధనోపాయమగ్నంబగుచు బురాణగాధావిచారణావథానంబు లేక తత్తరించుచుండ తీర్ణోపాయంబులలో సులభమై పతిష్ఠమై బహుధర్మప్రతి పాదకంబయి నానారసభావ సమగ్రభాజనంబయి సమస్తపురాణగాథాకథాసారవిరాజితంబై బహుకళామర్మ విచారదక్షంబై కథా సంవిథానచాతురీనిరంతరోత్తమకథా స్వాదనోత్సేక సంభావికంబయివిలసిల్లు కాశీమజిలీలకధా నిబంధనము సర్వజనచిత్తా కర్షకంబనుటకును సందియములేదు. దీనిలో రసాభావపుష్టియు గధాసంథాన కౌశలమటుండ జతుర్విధపురుషార్థకంబులగు మహాకవి వాఙ్మయములోని నవరసములు సాథారణకధాకధనధోరణిలో వెదజల్లబడియుండుటచే నివి పండితులకును గావ్యకర్తలకును గూడ బ్రతిభోన్మేషణక్షయంబులని నిస్సంశయముగాఁ జెప్పవచ్చును. ఇందు బారమార్ధకులకుఁదప్ప సామన్యులకురుచింపని శంకరాద్యాచార్యచరిత్రము లతిరసవంతముగా బరమార్ధబోధకంబుగ కధాధోరణిగా గూర్పబడినవి.

విశ్రాంతి చింతావినోదులకు జన్మజీవనతరణోపాయంబగు తీయనియౌషధంబువలెనుండు నీగ్రంథరాజమెంత పెద్దదియై పెరుగనున్నను విసుగులేక యుత్తరోత్తర సంపుటప్రకటనమున నెల్లరును వేచియుందురని నిశ్శంకముగా చెప్పవచ్చును. ఇందు గాదంబరీకథాసంపుటము ప్రౌఢసాహిత్యరచనా బంధురంబై రసభావవస్తృతంబై యించుక కఠినమయ్యును సాహిత్యజ్ఞానసోపానాధిరోహణమునకై నిర్మింపబడిన యీకథా