పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చింతామణి కథ.

107

తకై యింత నలవంతయేమిటికి ? ఇదిమోహముగాదు. పాతకవ్యూహము. నీకతంబున నేనుగూడ నిరయంబు బొరయవలసివచ్చును. అని యూరక నిందించుచుండ దానిపాదంబులకు శిరంబుసోక మ్రొక్కుచు నిట్లనియె.

చింతామణీ! నీవన్నమాటలన్నియు జ్ఞాపకమున్నవి. నాస్వాంత మెంతబలవంతమున మరలించుకొందమన్నను మరలినదికాదు. నేనేమి చేయుదును. నీపాదములతోడు. వేయుచెప్పుము. నీమొగము చూడక యఱనిమిషము తాళజాల. చంపినంజంపుమని పలికిన యాకలికి వెడగు నవ్వడర వెఱ్ఱిపాఱుఁడా! నీకింతమోహమేల కలుగవలయు. వస్తుతత్వము విచారింపకున్నావు. పో. అవ్వలిగదిలోఁ బండికొనుమని మందలించుటయు నతండు.

చింతామణీ ! నీకొఱకిదిగో పిండివంటకములు దీసికొనివచ్చితిని. ఇందాక నానోఁటికొక్కటియు రుచించినది కాదు. నీవుతినిన నా మనసు చల్లఁబడును. భక్షింపుమని పలుకుచు నామూటవిప్పి దానిముందరబెట్టి దీపము వెలుగుఁన దానికిఁ జూపించెను.

చింతామణి యా వెల్తురున మూటయందును బుట్టమునందును రక్తపుమఱకలుచూచి అబ్బురపాటుతో అయ్యో ! యీరక్త మెట్లువచ్చినది ? ఇందుఁబాముకూసపు శకలములున్న వేమి ? అని యడలుచుండ నతండు విమర్శించి చూచి అగునగు తెలిసినది గోడప్రక్కను వ్రేలాడుచున్నది త్రాడనుకొంటిని. త్రాచుపాము కాఁబోలు మెత్తగా నుండుటచే సంకోచమందితిని యాతొందరలోఁ బరిశీలింపలేదు. అని చెప్పుటయుఁ జింతామణి యురముపైఁ జేయివైచుకొని అక్కటా? అది పగపట్టి కఱచినదేమో? యెక్కడనో చూపుమని దీపముదీసికొని బయలుదేరినది.

ఆతండాకలికి నెలిసి యొద్దకుఁ దీసికోనిపోయే. బొటబొట రక్తము గారుచుండ నాసర్పము పూర్వకాయమట్లే వ్రేలాడుచుండెను.