పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

భక్షించుటకై గోడనంటి చూరుపెండెకై యెగఁబ్రాకుచుండెను. అది యతనికందు వ్రేలాడఁగట్టిన తెల్లనిజనపనారత్రాడువలెఁ గనుపట్టెను రజ్జుసర్పభ్రాంతికిమారుగా నిక్కడసర్పరజ్జుభ్రాంతి గలిగినది. తత్వవేత్త చిత్తమాత్మయందే లగ్నమై తదితరమెఱుంగ సట్లాలీలాశుకుని హృదయంబు చింతామణియందే వ్యాపించియున్నది. అతనికి సర్వము చింతామణివలెనే కనంబడుచున్నది.

తనకొఱకుభగవంతుఁ డాత్రాడు వ్రేలాడఁగట్టించెనని సంతసించుచు నతండు వంటకములమూట నడమునకుబిగించి యాసర్పోత్తరకాయంబు రెండుచేతులంబట్టుకొని కాళ్ళు గోడకుబిగియఁదన్ని రివ్వున పై కెగిరి యెలిసి యెక్కి లోపలధుమికెను.

ఆనిడుపని యొడలునలిగి సగము తెగి యతనిచేతికివచ్చినది. అతండది విమర్శింపక యందుఁబార వైచెను. ఉత్తరకాయము తెగిపోయినను నాభుజగము పెండెనంటిపట్టికొని బొటబొట రక్తముగారుచుండ నట్లె వ్రేలాడుచుండెను. తోకతెగినను పెండెపట్టువదలినదికా దాపామెంతగట్టిదియో చూడుఁడు.

తనకట్టినగుడ్డలు మఱకలగుటయుఁ గనుపెట్టక యాజన్నికట్టు కామాంధుఁడై లోపలియావరణము లన్నియు నతిక్రమించి తిన్నగాఁ జింతామణిబండుకొనియున్న లీలామందిరమున కరిగెను.

అప్పుడావారకాంత తల్పాంతరమునఁ బండుకొని నిద్రబోక లీలాశుకుని మోహాతిశయమును గుఱించి వితర్కింపుచుండెను.

లీలాశుకుండు మెల్లగాఁబోయి దానిమంచముదాపున నిలువంబడియెను. ఆచిగురుఁబోఁడి హటాత్తుగాఁజూచి యట్టెలేచి చీ ! చీ ! నీచా ! నీచెడుగుబుద్ధి వదలితివికావు ? నీకుఁ దలుపులెవ్వరుతీసిరి ? లోపల కెట్లువచ్చితివి? నీకుఁ జెప్పినబుద్ధులన్నియు నేగంగ గలిపితివి? యొక్క రాత్రియేతాళలేవా ? రేపెక్కెడికిఁ బోవుదును కుట్టులబొం