పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చింతామణి కథ.

105

మణితోఁ జెప్పెదనులే ? వేగము. నెర వేర్పుమని బ్రతిమాలికొనుచు నూతిఁయొద్దనే స్నానముజేసి యమంత్రకముగానర్చించి భోక్తలచేతిలో నాపోశనమువడ్డించెను. చింతామణిచే దక్షిణ యధికముగా నీయఁబడుటచే భోక్తలు మిక్కిలి యానందముతో భుజించిరి. భోజనానంతరము భోక్తలకు దక్షిణ తాంబూలాదులు పురోహితుఁడే యిచ్చి సత్కరించెను.

తరువాత లీలాశుకుండు పదినిమిషములలో భోజనముచేసి పురోహితుని వీథియరగుమీఁదఁ గూర్చుండి యిట్లు ధ్యానించెను. అయ్యో నేడెట్లు ప్రొద్దుగ్రుంకును ? ఎట్లుతెల్లవారును? చింతామణి మొగము చూడక యింతకాలమెట్లు సహింతును. దానింజూచి యుగాంతరము లైనట్లున్నది. అక్కటా? నాపాలిటి కీతద్దిన మెక్కడ వచ్చినది? ఆనాఁడు పాడుపురాణము వినకపోయినను దానికీసంకల్పము పుట్టక పోవును. అని యనేకప్రకారములఁ జింతించుచుఁ గొంతసేపందువసించి యట్టెలేచి దాని యింటిదెసఁకుబోయి దూరముగా నిలువంబడి యా వంక జూచుచుండెను.

అంతలో సాయంకాలమైనది. చీఁకటిబలిసినకొలఁది వానికి పరితాపమధికమగుచుండెను. ఆయావీధుల నంగడులవెంటఁ దిరుగుచు నారాత్రి పదిగడియలెట్లో వేగించెను. క్రమంబున వానికివిరహవేదన దుర్భరమైనది. మనంబున ననేక సంకల్పములుదయించినవి. ఏదో తెంపుచేసికొని తటాలునలేచి పురోహితునింటికిం బోయి వంటకంబుల గొన్నియడిగి మూటగట్టుకొని తిన్నగాఁ జింతామణియింటికిం బోయెను.

ఆయింటితలుపులన్నియు మూయఁబడి యున్నవి. పరిజనుల దాదుల సఖురాండ్రఁ బేరుబెట్టి పెద్దయెలుంగునంబిలిచెను. ఎవ్వరును మాటాడిరికారు. అప్పుడతండు మిక్కిలి యుద్రేకముతో నాయింటి చుట్టును ముమ్మారుతిరిగి పెరటిలో బశువులసాల కెలిసియుండుట దెలిసికొని యదిపరీక్షించిచూచెను. అప్పుడొక తెల్లత్రాచు చూరెలుకల