పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నాఁడు కోడి కూసినది మొదలు చింతామణి లీలాశుకుని లేపుటకుఁ బ్రారంభించినది. ఊ. ఉ. అని మూల్గుటయేకాని యతండు సూర్యోదయమైన గడియవఱకు లేవనేలేదు. అదిపొడువగాలేచి దంతధావనాది నిత్యకృత్యములు దీర్చికొనునప్పటికి జాముప్రొద్దెక్కినది. అప్పుడు చింతామణి కోపదృష్టితో నీవు తండ్రికడుపు చెడఁబుట్టితివి? నీతండ్రి యుత్తమశ్రోత్రియుఁడఁట. ఎంత జెస్పినను వివేకము గలుగదేమి ? ఉదయముననే స్నానము సేయవలయునఁట పదిగంటలైనది. దంతధావనమేలేదు. కడుపులోఁ బుట్టవలయంగాని చెప్పినబుద్ధి యేమాత్రమునిలుచును. అదిగో పురోహితుఁడు బాలునంపినాడు. వంటయైనదఁట పదపద. అని నిర్బంధించిపలుకగా నెట్టకేయువస్త్రము వైచుకొని చేతం గఱ్ఱబూని పాదరక్షలలోఁ గాళ్ళుపెట్టి చింతామణీ యిదిగో పోవుచున్నాను కోపము సేయుకుము అనిపలుకుచు బయలుదేరినంత నాకాంత వానిచెంతకువచ్చి విప్రకుమారా ! నేను జెప్పినమాటలు జ్ఞాపకమున్నవియా ! నేఁడు మాయింటికి రావలదుసుమీ? వత్తువేని నీ మొగమెన్నఁడును జూడను. జ్ఞాపకముంచుకొమ్మనిపలికి సాగనంపినది. అతండు కొంతదూరముపోయి యేదియోమఱచితినని మరలవచ్చి యచ్చిగురాకుఁబోడింజూచి పల్కరించుటయు నిలువనీయక పదపద ప్రొద్దెక్కినదని గెంటి తలుపువైచినది.

వెనుక వెనుక తిరిగిచూచుచు బలవంతమున మెరకకుఁబోవు ప్రవాహమువలెఁ బురోహితునింటికరిగెను. అతం డతనినిమిత్తమై యెదురుచూచుచుండెను. అయ్యో ! నీతండ్రి యాహితాగ్నిహోమము లెక్కువగాఁ జేయవలసియున్నది. ఇంత ప్రొద్దెక్కించితివేమి? భోక్తలు వచ్చి రెండుగడియలైనది ఎప్పటికిఁదేలును? అని పలికినవిని లీలాశుకుండు గురువరా? మంత్రములో నేమియును లేదు. తంత్రమాచార్యకల్పితము బ్రాహ్మణులుభుజించినంజాలు నీవులెస్సగాఁబెట్టించితివని చింతా