పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చింతామణి కథ.

103

గావున నాపాపము నీకుఁ జెందునని పరిహాసమాడెను.

అప్పుడుచింతామణి పశ్చాత్తాపముగాంచుచు నతనితలిదండ్రుల తిధులెప్పుడని యడుగుటయు నతండు పది దినములలోఁ తండ్రితిథియు మూఁడుమాసములలోఁ దల్లితిధియు వచ్చునని నిరూపించి చెప్పెను. ఆతిధులువ్రాసికొని చింతామణి పురోహితునితో అయ్యా! గతమునకు నేమియుంజేయఁజూలము. మాలీలాశుకునిచేతఁ దప్పక తద్దినముపెట్టింపవలయును. సరిపడినద్రవ్యమిప్పుడే యిచ్చుచున్నాను. యధావిధిగా జరిగింపుఁడు లోపమేమియు రానీయవలదని ప్రార్ధించినఁబురోహితుండు సంతసించుచు నాఁడుచేయవలసిన నియమములన్ని యుం దెలిపి వలసినంత ద్రవ్యము దీసికొని దానిందీవించుచు నింటికింబోయెను.

పిమ్మటఁ జింతామణి లీలాశుకుంజూచి చిఱునగవుతోఁ బురోహితునిమాటలు వింటిరిగదా? ఆబ్దికంబునకుఁ బూర్వాపరదివసంబులు నాబ్దికమునాఁడును మూఁడునాళ్ళు మీరు మాయింటికి రాఁగూడదు. కడు నియమముగా నుండవలయు జ్ఞాపకముంచుకొనవలయుననిపలికిన నతం డిట్లనియె.

అమ్మయ్యో? మూఁడుదినములు నిన్నుఁజూడక తాళఁగలనా? నాతండ్రితద్దినము నేనుబెట్టెదనోలేనో చెప్పలేనుకాని వెంటనేనీవు నా తద్దినము పెట్టింతువని చెప్పఁగలను. ఆబ్దికముమానినదోసము నిన్నంటుటసంశయముకాని బ్రహ్మహత్యాదోషము తప్పకనిన్నంటఁగలదు. అని వికటముగాఁబలికెను. ఆవిషయమిరువురకుఁ బెద్దసంవాదము జరగినది.

చివర కతనిచేఁ దద్దినమునాఁడుమాత్రము రానని యొప్పించునప్పటికియొక యుపవాసము చేయవలసివచ్చినది. గండమునకు వెరచి నట్లాబ్దికము సమీపించినకొలఁది యతండు దిగులు పడుచుండెను. పూర్వదివస నియమ మాచార్యుని కప్పగించెను. పరదివస నియమము భోక్తల కర్పింపఁదలంచెను.