పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చింతామణి కథ.

101

చిం — కారణముగలిగియే యడిగితిని. పెట్టుచుంటివా? లేదా?

లీలా — నాలుగైదు వత్సరములనుండి పెట్టుట లేదు.

చింతా - ఎందువలన?

లీలా - తీరిక లేక

చింతా - అయ్యయ్యో! నీకుఁ దద్దినము పెట్టుటకే తీరుబడి లేకపోయినదా?

లీలా -- నీవు చూచుచుండలేదా భోజనముచేయు సమయముఁ దక్క తక్కిన కాలమెల్ల నీయొద్దనేకాదా వసియించుచుంటిని? .

చింతా - నాయొద్దకువచ్చినదిమొదలు మానివేసితివికాఁబోలు

లీలా - అవును.

చింతా - హరి హరీ! యెంత పాపాత్మురాలనైతిని. నీవును నేనుంగూడ రౌరవములో వసియింపదగినదే!

లీలా - నేఁడు పురాణములో విన్నమాట లివియాయేమి?

చింతా - అవును. ఈమాటలేవింటిని. తద్దినముమానినవాఁడు మహాపాపాత్ముఁడంట జీవచ్చవమంట వాని మొగముజూచిన పాపము వచ్చునంట.

లీలా - ఇదియా నీకుఁగలిగిన భయము. చాలుఁజూలు. ఇవి మా బాపనయ్యలు విత్తములాగటకై వ్రాసిన వ్రాఁతలు.

చింతా — నీ వంటి మహానుభావములు పుట్టుటచేఁ గులగౌరవముగూడ చెడిపోవఁగలదు. ఏటిమాటలాడెదవు?

లీలా - ఆరిన దీపమునకుఁ జమురువోసిన నెంతలాభమో మృతునకుఁ దద్దినము పెట్టుటయు నట్టిదే.

చింతా — నాస్తికవాదములు నా కంగీకారములుకావు నీ కా తిధులేప్పుడో తెలియునా?

లీలా - ఇప్పుడు జ్ఞాపకము లేదు.