పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మునఁ బురాణము సెప్పుచుండ నరిగి శ్రద్ధాభక్తి పూర్వకముగా నాలింపుచుండె నందు.

శ్లో॥ శ్రాద్ధాత్పరతరం నాస్తి శ్రేయస్కర ముదాహృతం।
      నసంతి పితరశ్చేతి కృత్వా మనశి యో నరః॥
      శ్రాద్ధం నకురుతె తత్ర తస్యరక్తం పిబంతితె॥
      సూ॥ పితౄన్ యజేత పితృభ్యోదద్యాత్॥

క. పితరులఁ గొలువంగాఁదగు
   బితరుల కీయంగవలయుఁ బిండోదకముల్
   పితృసేవ కన్నఁబరమ
   వ్రతమిల లేదొకటి శుభకరంబు తలంపన్ .

క. పితరులు లేనేలేరని
   మతిఁదలఁచుచు నాబ్దికంబు మానునొయెవఁడా
   కితవుని రక్తము పితృదే
   వతలా ర్తింబీల్తు రతి పిపాస దలిర్పన్ .

గీ. తల్లిదండ్రుల మృత తిధిన్ధర్మబుద్ధి
    బ్రాహ్మణార్చనసేయని బాలిశుండు
    వర్ణితుండగు జీవచ్ఛ వంబటంచు
    కల్మషములంటు వాని మొగంబు గనిన.

అని పౌరాణికుండు జెప్పిన విని చింతామణి డెందంబున నేదియో విచారం బుదయింప నల్లన యింటికింబోయి తననిమిత్తమై వాకిటఁ గాచికొనియున్న లీలాశుకుంగాంచి హస్తగ్రహణము సేసి లోనికిం దీసికొనిపోయి పర్యంకోపవిష్టుం గావించి యతని మొగంబున వేడిచూపులు వ్యాపింపఁజేయుచు నిట్లనియె.

చిం - లీలాశుకా! నీవుతలిదండ్రుల యాబ్దికములు బెట్టుచుంటివా?

లీలా - ఇప్పుడామాట నడుగుటకుఁ గారణమేమి?