పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నీమెయందుఁ జాలభయభక్తులు గలిగియున్నవి. ఆమె బంపఁగా నిక్కడికి వచ్చినదేమో యని చెప్పిన నతండు నవ్వుచు నాయోగిని దెసకుఁ బోయి దేవీ ! నీవెవ్వరి నిమిత్తమిట్లు వెదకుచుంటివి? పని యేమనియడిగిన నామె బాబూ! మొన్న నీయూర రాజసభలో సంగీతము పాడిన గాయకులిందున్నారని వింటిని. వారిం జూడవచ్చితి నెందున్నారో చెప్పఁగలరా ? యని యడిగిన నతండిట్లనియె.

నీవు సంగవజిన్‌తురాలవు. సంగీతము శృంగార రసదీపకము. అట్టిగాన బ్రసక్తితోఁ నీకుఁ బనియేమి? వైరాగ్యప్రవృత్తికి ధర్మమా? అని యడిగిన నామే చిఱునగవుతో బాబూ ! నాదబ్రహ్మము పరబ్రహ్మ బోధకమైనది. సంగీతము వినుచుండ నాడెందము పరబ్రహ్మమందు లీనమగుచుండును. అందులకే నారదమహర్షి సంగీతప్రియుండయ్యెను. నేను బుడమిఁగల గాయనగాయనీమణుల సంగీతములు పెక్కులు వినియుంటిని. పాటలు వినుటకే నేను దేశాటనము చేయుచుంటిని. ఈదేశాధిపతి విపులుఁడు నాయందుఁ గురుభక్తిగలవాఁడు మొన్న వారికడ వీరేమో పాడిరఁట. ఆగాన మతఁడూరక మెచ్చికొనుచున్నాడు. నేనప్పుడు గ్రామములో లేను నాతోఁ బెద్దగా వర్ణించి చెప్పుచు వారీసత్రంబున నున్నారని యెఱింగింప నిందువచ్చితిని వారు మీరేనా? అట్లైన నేను ధన్యురాలనే! ఇంచుకపాడి శ్రోత్రానందము గావింతురా మిమ్ము దీవించి యేగెదనని కోరిన నతండు చిత్రసేనంజీరి కొంచెముసేపు పాడుమని సంజ్ఞ జేసెను.

పురుషవేషముతోనున్న యాచిన్నది. ముసి ముసి నగవులతో వీణశ్రుతి వేసి తంత్రుల నాలపించుచు గంఠనాదముతోఁ గలిపి హాయిగాఁ బాడినది. అప్పుడాయోగిని గంతులువైచుచు నోహెూహో ఎంతకాలమున కిట్టి సంగీతము వింటిని. నేఁటితో నాచెవుల త్రుప్పు వాసినది. ఇట్టిసంగీతము పాటలీపుత్రనగరంబున రతినూపురపుత్రికలు