పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

త్రుఁడు పాటలీపుత్రనగరవాస్తవ్యురాలగు రతినూపురయనువేశ్యపుత్రికలు చిత్రసేనారతిమంజరులవెంటఁబెట్టికొని ధారానగరముజేరినకథయు శ్రోతవ్యముగానుండును. కుచుమారుఁడు సరస్వతియను రాజపుత్రిక నరువదినాలుగువిద్యలలో నోడించి రాజ్యముతోఁగూడ నాచేడియంబరిగ్రహించినకధయు భూతోచ్చాటన గావించి మదయంతిని బెండ్లియాడిన గోనర్దీయునికధయు ముందుగాఁ జదివితీరవలయును. చారాయణుఁ డుత్తరదేశారణ్యసంచారముగావించి లోకోత్తరరూపగాన కళాలలితయగు యక్షవనితం బరిణయం బాడి ధారానగరము జేరి మిత్రులంగలిసికొనిన చమత్కారము విస్మయముగలుగఁజేయక మానదు.

ఘోటకముఖుఁడు భోజునివెంటఁ దిరిగితిరిగి రాధయను వృద్ధ నాశ్రయించి వరాహద్వీపమునకేగి యామె మనుమరాలిఁ బెండ్లియాడి మిత్రులం గలిసిసవిషయము సొంపుగావర్ణింపఁబడి యున్నది. ఇందుచింతామణి లీలాశుకుఁడు మదాలసకౌశికుఁడు లోనగువారియుప కధలు చాలగలవు. పెక్కులువ్రాయనేల ఏకధలెట్లున్నవని నిరూపించుటకుఁ జదువరులలే ప్రమాణము—పదార్థములు వడ్డించి రుచులడుగనేల?

ఇందు విశేషించి చతుష్షష్టికళలు అరువదినాలుగు విద్యల యొక్కపేరులు(వైశికప్రకరణము) వ్రాయబడినవి. వానింజదువుటకు విసువుగలవారు విడిచిచదువవచ్చును. కథాసందర్భమునకు లోపముండదు.

2-3-4 కూర్పులపీఠిక.

ఈముద్రణమందు మార్పులేమియును జేయలేదు. కాకితములు మంచివని చదువరులే గ్రహింతురు. ఈకాశీమజిలీకథలు ఇప్పటికిఁ పది భాగములు ముద్రించితిని. దీనితోఁ బూర్తియైనదికాదు. పండ్రెండవ భాగముతో గ్రంథము బూర్తిజేయఁదలంచికొంటిని (11-12భాగము లొకతూరియే ముద్రించి ప్రకటింతుము.) సాధ్యమైనంతత్వరలో వెలువడగలవు. వీనిగుఱించి యిచ్చినపండితాభిప్రాయములు చాలగలవు. దైవానుగ్రహమున 12 భాగములు పూర్తికాబడినది.