పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

కాశీమజిలీకథలు - మూడవభాగము

బున కెగరి యొక గవాక్షముసమక్షమున డాగి యాజవరాండ్రందఱు నిద్దురబోవు వరకు బ్రతీక్షించి సద్దుడిగిన వెనుక మెల్లగా లోనికిఁబోయెను. ఆగది అలంకారములన్నియు నాదినంబున వింతగానున్నవి. దారిలో మధురిక పరుండియుండెను. దానిం దాటి యాపాటలగంధి పర్యంకము దాపునకుం బోయెను. ఆచిన్నదియు నూత్నాంబరాలంకారములు ధరించి ఉన్నది. పెద్దయుం బ్రొద్దు మేల్కొన్నది కావున గాఢముగా నిద్రపోవుచున్నది.

ఆ రాజకుమారుండు వెనుకటి రేయింబలె అయ్యబలకుచకలశములయందును గండములయందును చందనచర్చగావించి పిమ్మట దన వ్రేలియుంగర మయ్యంగన వ్రేలనిడి అక్కల్కి ఉంగరము తానుధరించెను. అప్పటికిని లేవకున్నంత స్వాంతమున బరబుద్ధి యప్రత్యక్షమైనది యేమిప్రమాదము వచ్చునోయని తలంచుచు సాహసింపక యందొకచో బైడిపళ్ళెమున నమరించిఉన్న వీడియము వైచుకొని యోహో: ఇది పురుషులు వైచుకొనదగిన తాంబూలమైయున్నది. ఇందు గస్తురి కన్న కప్పుర మిబ్బడించియున్నది యిది నానిమిత్తమే చుట్టిఉంచిరి. కానిచో వనితల కిట్టిదిబెట్ట నేమి ప్రయోజనమని నిశ్చయించి యాతాంబూలరసం బత్తురుణిమణి మొగమునకు రాచి తానువ్రాసిన చిత్రపట మక్కలికి ప్రక్కలో'నిడి యింతలోఁ తెల్లవారుసమయమైనది. గావున నాజింకనెక్కి తనయిక్కకుంజనియె.

మరునాడుదయంబున లేచి యాచిగురుబోడి యాచిహ్నములన్నియుం జూచుకొని వెరగుజెందుచు మధురికా! నీవును రాత్రి నిద్రబోయితివి కాబోలు. మొన్నటి కన్న గురుతులెక్కుడు గనంబడుచున్నవి మనమీ పళ్ళెరములో నుంచిన వీడెము వైచుకొని యారసము నాకంటించెను చూడుము. ఇంత గాఢనిద్ర పట్టినదేమి? అయ్యో! ఇంకను జూచుకొనలేదు ఈ ఉంగరమెవ్వరిది? నాఉంగర మేమయ్యెనని అనేకప్రకారముల సందేహింపుచు నా ఉంగరమును శోధించి అందున్న అక్షరములం జదివి గంధమద్దిన ఉంగరమిద్దియే. బోటీ! యిటువంటిచిత్రమెప్పుడును కనివిని యెరుంగమే? పోతుటీగకేని నీఅంతఃపురమునకు రాశక్యము కాదు. ఈ కందర్పు డెవ్వడు? ఎట్లువచ్చుచున్నవాడు? భళిరే! చోద్యములు పుట్టెనని పలుకుచు నంతలో దల్పంబున నున్న చిత్రపటము జూచి కామినీ ఇదియేమిటిది? చిత్రఫలకము! అయ్యారే ఇందున్న మిథునము దర్శనీయముగానున్నదిసుమీ! ఈలాటి దాంపత్యమును గూర్చినచో చతుర్ముఖుడు స్తోత్రపాత్రు డగును. అనుటయు మధురిక యాచిత్రపటమును గైకొని శోధించి .... జవ్వనీ! యెంతముగ్ధవే! యిందున్న చిన్నది యెవ్వతెయో చెప్పుకొనుమని యడిగిన అది గ్రహించి మదవతీ! యిది మదీయప్రతిబింబమా యేమి? ఈపురుషుడు మనల వంచించుచున్న కందర్పుడగుట నిశ్చయమే అని అడిగెను

మథురిక నవ్వుచు నీభాగధేయము ఫలించినది. ఈతండు కంతు వసంత