పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

కాశీమజిలీకథలు - మూడవభాగము

అప్పు డప్పూబోడియు బాణిని వీణెంబూని కొంతసేపు హాయిగా గీతముబాడినది ఆ గానస్వానమునకు ధాక్కి యారాజపుత్రు లిరువురు మేనులు మఱచి చేష్టలుదక్కి పీఠములపై కొరిగిరి.

మఱియు హైమవతి యారాత్రి మిక్కిలి చక్కగా అలంకరించుకొన్నది కావున జగన్మోహనాకారముతో నున్న యా యన్నుమిన్నంజూచి జయభద్రు డంతకుమున్ను గుట్టుపట్టుకొని యుండెను. కానిఅప్పుడు మనంబుబట్టజాలక మన్మథశరపీడితుండై యాలంబనోద్దీపనవిభావాది విశేషంబుల గమక్రమంబున నుత్సాహంబు దీపింప అన్యాపదేశంబున గొంతసేపు తదవయవంబు లంటుచు చివరకు మోహమాప లేక బిగ్గరగా గౌగిలించుకొనెను. అప్పుడప్పడంతి యలంతి నవ్వొలయ ఓహో! మోహనాంగా! మీ కిప్పుడు సమయము దొరికినది కాబోలు. యిన్నిదినము లేకాంతముగా నున్నప్పుడు డుపేక్ష సేయనేల మంచిసమయమే కనిపెట్టితిరి? చాలు చాలు! యిరువంకలను శత్రురాజుల నిడికొని వారిని వంచింపబోయి మీరే యిట్లు పంచశరునిచేత వంచింపబడుచుంటిరే? నేను ఱే పెక్కడికి బోయెదను ఇప్పుడు వారి విషయమై చేయదగిన కృత్యముల నాలోచింపు డనుటయు నా జయభద్రు డిట్లనియె.

ఇంతీ! యింతదనుక నీరూపముజూపి శత్రువుల వంచింపదలచితిని. కాని ఇప్పుడు నేనే వంచితుడనైతిని. నీయాకృతిఁ జూచి మహామునులుగూడ మోహింతు రనుచో మా బోటుల మాట నొడువనేల! అని పలికి అచ్చిలుకలకొలికిని బాహ్యరతోద్యోగంబున గుతుకబఱచుటయు అత్తరుణి, యార్యా! యిది యాపత్సమయము. జననీజనకులు జెఱసాలనుండ నాకేయుత్సాహమును గలుగకున్నది. విధివిధానంబున వారివలన నన్ను స్వీకరించి యథేష్టసౌఖ్యంబులం బొందుదురుగాక! శత్రువులం బరాభవించు తెరం గరయుడని యెన్నియో నీతులు జెప్పి అతని యుద్యమము వారించినది.

అప్పు డతండు యెట్టకే నచ్చటినుండి యీవలకు వచ్చి ముందుగా ధనవర్మ యున్నగదిలోనికి బోయి మోహపరవశుండై యున్నయతనిని లేపి యాయిల్లు దాటించి యింటికి బంపెను.

తరువాత గుణవర్మనుగూడ నిల్లుదాటించి నేను జెప్పిన విషయము యథార్థమని నీ కిప్పటికైనను దెల్లమైనది గదా యని పలుకుచు అతని నివాసమునకు బంపెను.

అంత మఱునా డుదయంబున నారాజకుమారు లిరువురు రాత్రి తాము చూచిన విషయమును మనమున బలుమారు వితర్కించుచు నొండొరుల వధోపాయ మాలోచించిరి.

ఆహా ! మిత్రద్రోహుడైన నాచాయ నన్నువంచించి హైమవతిని బ్రచ్ఛన్నముగా అనుభవించుచున్నాడు. యేమియు నెఱుగనట్లు నాతో దానుగూడ నాచేడియ కొరకు పరితపించుచున్నాడు. ఈకుట్రను తెలియక నిష్కారణము పరమనైష్ఠికుడైన సన్యాసిని మర్యాదకుటుంబములో జనించిన రత్నవర్తకుని మఱికొందరిని