పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

53

రూప్యము లిచ్చెద సమ్మితమేని బుచ్చుకొనుడు, లేనిచొ బొండనిపలుకగా అతడు నవ్వుచు ఓహో! వర్తకుడా? క్రమక్రమముగా దగ్గించుచుంటివే మాకు వేళ మించుచున్నది. యేదియో వడిగా నిచ్చి పంపమనగా నావర్తకునికి తిరుగా నాస పుట్టినది అరీతి గ్రమక్రమముగా దగ్గించి చివర కొక స్వయంపాక మిచ్చి యంపెను.

ఆదినమునకు సరిపడిన భోజనసామాగ్రి పుచ్చుకొని అతఁడు సంతోషించుచు నింటికివచ్చి హైమవతి కిచ్చిన అచ్చిలుకలకొలికియు జక్కగా బాకము జేసినది.

ఇంతలో అతండెద్దియో పనిమీద అంగడికి బోవుచు దారిలో నొక దేవాలయము గనంబడినంత దానిలోనికి బోయెను.

ఆచ్చట దుఃఖితుండై యున్న యొక సన్యాసింజూచి, వందనము చేసి అతఁడు అయ్యా ! తమరు శోకరహితమైన యాశ్రమమున నుండియు నిట్లు చింతించుచున్నారే అని అడిగెను.

అప్పుడయ్యతి అతని వాక్ప్రఢిమకు సంతసించుచు అనఘా నాకు మూడునాళ్ళనుండి భోజనములేదు. ఏ గృహస్థుడును బిక్షకు బిలిచినవాడుకాడె. నాకు మిక్కిలి యాకలి అగుచున్నది. దానంజేసి చింతించుచున్నవాడ. కష్టాత్కష్టతరంక్షుధా అను నార్యోక్తి వినియుంటిరికదా! అని పలికిన జయభద్రుడు శివ, శివా, ఈయూరిలో బ్రాహ్మణులులేరా? ఆయ్యో! మిమ్మునుపవాసములుంచి వారెట్లు భుజించిరి? కట కటా? యెంతకఠినహృదయులు! అని పలుకుచు మరియు నిట్లనియె. స్వామీ? మేముక్షత్రియులము సత్రములో వంటచేసికొనుచున్నాము. మాయింటికి విచ్చేసి ఇంత యాతిధ్యము పుచ్చుకొని మమ్ములను కృతార్థులను జేయుడని వేడుకొనగా అయ్యతి సంతోషించుచు మంచిది. త్వరలో వంటచేయించి వర్తమానము పంపుమని పలికెను.

జయభద్రుడు యథావిధి బిక్షావందనము జేసి యింటికి బోయి హైమవతి కావార్త నెఱింగించిన అయ్యించుబోడియు సంతోషముతో దృటిలో వంట చేసినది.

తరువాత జయభద్రుడు స్వాములవారిని భయభక్తులతో దీసికొనివచ్చి అర్చించెను. పాదములు కడుగు సమయమున జయభద్రునితో వత్సా! నీభార్య నిటు రమ్మనుము. పాదోదకము శిరముపై జల్లవలయుననగా అతండు నవ్వుచు చిత్తము చిత్తము అని పలుకుచుండెను.

ఆమాటలు విని హైమవతి నిస్సంశయముగా వచ్చి అతనిఅడుగులు గడుగుచు తీర్దము శిరముపై జల్లుకొనినది.

అప్పుడా స్వాములవారు అక్షతలు ఇరువుర మీదను జల్లెను. అదియే తమకు శుభలగ్నమని యిరువురు మనంబుల సంతోషించిరి. తరువాత అయ్యది యాపోశనమును హస్తతలంబునం దుంచుకొని తన వాడుక ప్రకారము ఒక వరహా దక్షిణగా నాకీయవలయును లేకున్న భుజింపక లేచిపోయెనని జయభద్రు నడిగెను.

అతఁడు తనయొద్ద నేమియును లేమింజేసి చింతాక్రాంతుడై ఆయ్యో! స్వామీ! మీరిప్పుడు భుజింపక విస్తరి విడిచిపోయినచో బ్రత్యవాయము కాదా?