పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

కాశీమజిలీకథలు - మూడవభాగము

అట్టివినోదములతో వారివురు నారాత్రి వేగించి యుదయంబున లేచి వేషములు మార్చి పయనమై నడచి రెండుమూడు దినములకు మఱియొక గ్రామము జేరిరి.

అందొకయింట వసించి వారిచేత రొక్క మేదియు లేమింజేసి భోజనసామాగ్రికై సందేహించుచున్నంత నక్కాంత జరభద్రున కిట్టనియె.

ఆర్యా! మనము ద్రవ్యమునకు జిక్కుపడవలసిన అవసరము లేదు. నామేని అలంకారములమ్మి సొమ్ము తీసికొనిరండు దాన యథేచ్ఛగా వ్యయపెట్టుకొనవచ్చు నని పలుకుచు నవరత్నములచే జెక్కబడిన కర్ణభూషణమొకటి అతనిచేతి కిచ్చినది .

మిక్కిలి వెలగల యామండనము గైకొని అతండురహస్యముగా నంగడికి బోయి రత్నవర్తకు నొక్కనినరసి అతనికి నావస్తువులు జూపుచు దీనికేమి వెల యిచ్చెదవని అడిగెను.

ఆవర్తకుడు అతని మొగము పరిశోధించి గౌరవముకలవాడని యూహించియు నవసరముతో నమ్ముచున్నట్లు నిశ్చయించి యాభూషణము లక్షలకొలది వెలగలిగి యున్నను ఇంచుక శోధింపుచు బెదవి విరచి యిట్లనియె

అయ్యా! ఈవస్తువు నాకవసరములేదు. అయినను మీరెంత కిచ్చెదరో చెప్పుడు నచ్చెనేని బుచ్చుకొనియెద ననుటయు నతఁడు నా కీవిషయమ నాణెము తెలియదు వర్తకులగు మీకు దీని వెల దెలియును. కావున నించుమించుగా నడుగుడని చెప్పెను

ఆప్పుడా వర్తకు డొక్కింత విమర్శించి ఆయ్యా! ఇది జోడువిడిపోవుటచే మండనమునకు బనికిరాదు. విడదీసి రాళ్ళ నమ్ముకొనవలయును. కావున నాకేమి నిరూపించుటకు దోచకున్నది. అయినను నూఱురూప్యము లియ్యవచ్చునుకాని నాకు బది తగ్గించి బుచ్చుకొనియెద ననుటయు నతండు నిజముగా నట్టివస్తువుల వెలనెఱుగమి నంత మా త్రమునకే సంతసించుచు మంచిది యాసొమ్మే తెమ్మనిపలికెను.

అతనిమాటలువిని యావర్తకుడు పశ్చాత్తాపము చెందుచు అయ్యో! వీరికేమియు ధరలు తెలియవు. నిష్కారణము సొమ్మెక్కువ బెట్టితినే కానిమ్ముఅని యాలోచించి లోనికిబోయి మరల వచ్చి అయ్యా! మాయన్నగారీ కుందనమింత వెలచేయదని చెప్పినాడు. ఏబదిరూప్యము లిచ్చెదను యిచ్చెదరా? అనుటయు అతండు అప్పటికే ప్రొద్దెక్కి కతంబున భోజనమునకు దొందరపడుచు గానిమ్ము. అంతియే తెమ్ము వేగము పోవలయునని పలికెను.

అప్పుడా వర్తకుడు అయ్యో! యితడు, దీనికిని సులభముగా సమ్మతించు చున్నవాడు. యిరువది యనక యేబది అంటిని. ఇదియు బ్రమాదమే. అని యాలోచించుకొని యావస్తువును రెండుసారులు తిప్పి అతని కిట్లనియె.

అయ్యా? జయభద్రునిభార్య సునీతియను చిన్నది. రత్నభూషణములు బ్రాహ్మణులకు నిత్యము కోట్లకొలది దానము జేయుచున్నది. యావస్తువులు సులభముగా నాబ్రాహ్మణు లమ్మజూపుచున్నారు. దానంజేసి ఇప్పుడు రత్నముల వెలకు తగ్గినది. రత్నభూషలు కొనుటకే భయమగుచున్నది. చివరమాట దీని కిరువది