పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

కాశీమజిలీకథలు - మూడవభాగము

రేమి చేయగలరు? అని మరల ధైర్యమవలంబించుచు వానిపై దృష్టిప్రచారములు వెలయింపుచున్నంత నయ్యాటవికుడు వడివడిగా నాయొద్దకు వచ్చెను.

నేనును వానింజూచి యించుక వెఱచుచు వెనుకటడుగులతో నోరసిల్లుటయు వాడదిచూచి వికృతస్వరముతో పెట్టా! ఎవ్వతెవు నీవు? ఈ అడవినడుమ కెట్లు వచ్చితివి? నీయూరెక్కడ అని అడగెను.

వాఁడడిగినమాటలు అంత స్పష్టములేకున్నను స్వభాషలోనివే అగుట నేను గొంత సంతసించి యోరీ! మాది అమరావతి; మాతండ్రిపేరు మంత్రపాలుఁడు నన్ను నిన్నరాత్రి గుఱ్రపుదొంగలు దీసికొనివచ్చి యీ అడవిలో విడిచిపోయిరి. దారితెలియక క్రుమ్మరుచుంటిని నీకుగావలసినంత ధనమిత్తును. నన్ను మాయూరు జేర్పగలవా? అని అడిగితిని.

అప్పుడువాఁడు నవ్వుచు పెట్టా! నీమాటలు నాకేమియుఁ దెలియలేదు. ధన మనగానేమి? మీయూరెచ్చటనో నేనెఱుంగుదునా? నిన్ను దొంగలేల తీసికొని వచ్చిరి? అని పలుకగా నేను వానికేమియు దెలియదనియు మృగతుల్యుడనియు నిశ్చయించి యాహారార్ధమై మూటగట్టి తెచ్చిన భక్ష్యములు విప్పి వానికిచ్చితిని.

వానిందిని వాడు గంతులువైచుచు పెట్టా! ఇలాంటిపండ్లు యేచెట్టున దొరికినవి? ఆ చెట్టు నాకుఁ చూపుము? మంచిరుచిగానున్నవి సుమీ? ధనమనగా నివియేనా యేమి? నిన్నెచ్చటికిం తీసికొని పోవలయునో చెప్పుము. నీవు మేనంబెట్టుకొన్నవి యేచెట్టు పూవులు? నీవు గట్టుకొన్న యాకు మంచి మృదువుగా నున్నదిగదా! ఈలాటివి మా అడవులలో లేవు మీఅడవి యెచ్చటనున్నదో చూపుదువా అనిపాకృతపు మాటలు పలుకగా నాకు నవ్వువచ్చినది. వాని చర్యలన్నియుఁ జూడ నాకప్పుడు ఋష్యశృంగుని చరిత్రము జ్ఞాపకమువచ్చినది వానికిఁ ఔర్వమను మాటయే తెలియదు. మహర్షితుల్యుడగు వానింగాంచినంత నాకుఁ గొంత దుఃఖము తగ్గినది. నేను వానింజూచి యోరీ? మీఅడవిలో నేమిదినియెదరు? నీకు నాలుబిడ్డలుగలరా? మీపల్లె యెక్కడన్నది? అని అడుగగా వాఁడు పెట్టా! మేము అడవిపండ్లను పచ్చిమాంసము దిని బ్రతుకుదుము. నాకుఁబిల్లలు లేరు. భార్యయున్నది. మాయూ రీప్రాంతమందే యున్నది. మాయింటికిఁ దీసికొనిపోయెదను. నాతోఁగూడ వచ్చెదవాయని అడుగగా నేనును వానిమాటలకు సంతసించుచు నాలాగే వత్తును పదయని పలికితిని.

వాఁడు మాట్లాడు మాటలలో బదింటికి నొకటిరెండు తెలిసినవి. నేను మీతో నిట్లు చెప్పుచుంటిని కాని వాఁడు మిక్కిలి వికృతముగా మాట్లాడెను.

వానితో నడుచునప్పుడు నడుమ పెట్టా! నీవు నాకిందాక యిచ్చినపండ్లు మఱిరెండు యియ్యవా అనిఅడుగగా నాకును వానిదైన్యమునకు జాలివొడముటచే నాయొద్దనున్న భక్ష్యము లన్నియు నిచ్చివేసితిని.

భక్ష్యములం దిని వాడువైచినగంతు లేమని చెప్పుదును. ఆ నాట్యము