పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హైమవతికథ

43

చూచితీరవలయును. అంతకష్టములో నున్నప్పుడును నాకుఁబట్టలేని నవ్వువచ్చినది పులివాతనుండి తప్పించిన యప్పుణ్యాత్ముని ఋణంబు నేనెట్లు తీర్చుకుంటును.

వాడు కొంతదూరము నాతో వచ్చి పెట్టా! నీమాటలసందడిలో బులిమాంసము మాట మరచిపోయితివి. నీవిచ్చటనేయుండుము నేనుబోయి యా పులిమాంసము గోసికొని వచ్చెదను. దానిచర్మము చలికాలములో మిక్కిలి యుపయుక్తముగా నుండును. ఆలాటి చర్మములు మాయింటినిండ నున్నవికాని యీనాఁడు దినుటకు మాంసమేది అని నాపెట్ట అడిగినచో నేనేమి చెప్పుదును. ఊరకపోయినచో నన్ను బాదగలదు. వేగమ పోయివచ్చెద ననుటయు భయపడుచు నిట్లంటి. ఓరీ !నేను నిన్ను విడిచి నేనొక్కరితను యిక్కడనుండలేను ఇచ్చట మృగములబాధ మెండుగా నుండినది. నీధనుర్బాణములు చూచి దరికిరాక పాఱిపోవుచున్నవి. నీతో వెనుకకు వచ్చుటకు గాళ్ళు నొప్పులుగా నున్నవి. ఆచోటు దూరముగానున్నది. నన్ను మీ యిల్లుజేర్చి తరువాత నీవువెళ్ళి మాంసము తీసికొనిరమ్ము. నాయందు దయయుంచి యీమాత్రముపకారము సేయుమని బ్రతిమాలుకొనగా నావనచరునికిని దయవచ్చి నాతో నిట్లనియె.

పెట్టా! అట్లైన నేనింటికి వత్తునుగాని నాపెట్టతో నేను బులినిం గొట్టినట్టు చెప్పకుము. చెప్పితివేని యూరకవచ్చితివేల యని నన్ను నాభార్య వింటిబద్దతో గొట్టును. ఏమియు దొరకలేదని బొంకెదను. నిన్ను జూచినది మొదలు నాకేమియో కనికరము పుట్టుచున్నది నీకొఱకే యిట్లు బొంకెదనని పలుకగా నేనును సంతసించుచు వల్లెయని వానితోఁగూడ నడవఁదొడంగితిని.

వాడును గొంతదూరము దీసికొనిపోయి యొకచెట్టుక్రింద నిలువంబడి ప్రాత తాటియాకులచే గప్పబడియున్న యొక డొంకఁజూపుచు నిదియే మాయిల్లని చెప్పెను.

అదిచూచి నేను విస్మయమందుచు అహో! భళిరే, బాగు బాగు వనచరా! నీయిల్లు చక్కగానున్నది. నీ పెట్ట యెచ్చటికిఁబోయినది? మీపల్లె యెందున్నదని అడిగితిని.

వాడు నా పెట్ట యీచుట్టుపట్ల నెచ్చటికో బోయినది. వచ్చు వేళయైనది. మా పల్లె యిదియే. ఇలాటి యిండ్లె; అవిగో! కనంబడుచున్నవి చూడుము. లెవ్వుచుంటి వేమి? చక్కగా లేవాయేమి? అనయడుగగా నేను ఓరీ! వర్షము వచ్చినప్పుడీ డొంకలలో నెట్లుండెదరు? మీకు జలిలేదా? అని అడిగితిని.

వాడు వర్షముగురియునప్పుడు మేము మృగచర్మములు గప్పుకొందుము. గాన మాకేమియు జలియుండదు. లోపలకురమ్ము. మాయిల్లు చూచెదవుగాని అని పలికి ద్వారమున కడ్డుగానున్న యాకులాగెను. అప్పుడు నేను వానితో లోపలికిబోయి చూడనేమియునులేదు. కొన్ని చర్మములు మాత్రము పఱువబడియున్నవి. అచ్చట